దర్శకరత్న దాసరి నారాయణరావు తర్వాత సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఎవరు ఉంటారు అనే ప్రశ్నకు సమాధానంగా అందరి దృష్టి మెగాస్టార్ చిరంజీవిపై పడ్డాయి. అందుకు కారణం.. ఆయన కరోనా క్రైసిస్ సమయంలో అందరి హీరోలను ఏకతాటిపై తీసుకొచ్చి.. తాను కొంత విరాళం అందించి, ఇతర హీరోలకు అందించే విరాళాలను తీసుకుని దాన్ని సక్రమంగా సినీ కార్మికులకు చేరేలా ముందుండి అందరినీ నడిపించారు. దీంతో మురళీ మోహన్, తమ్మారెడ్డి భరద్వాజ సహా పలువురు సీనియర్స్ తదుపరి సినీ ఇండస్ట్రీకి పెద్ద అని చెప్పేశారు. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో చిరంజీవి పెద్దరికంపై ఇన్ డైరెక్ట్‌గా అభ్యంతరం చెప్పేశారు సీనియర్ నరేష్. తాము సీనియర్ విలక్షణ నటుడు మోహన్‌బాబు గైడెన్స్ వెళ్లాలనుకుంటున్నామని ఆయన చెప్పడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి సందర్భంలో సినీ పెద్దరికంపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. ఈ క్రమంలో రీసెంట్‌గా జరిగిన యోధ డయాగ్నస్టిక్స్ ప్రారంభోత్సవ సమయంలో సినీ ఇండస్ట్రీలోని అన్నీ విభాగాలకు కాస్త రాయితీ ఇచ్చేలా చూడాలని యాజమాన్యాన్ని వేదికపైనే చిరంజీవి రిక్వెస్ట్ చేశారు. ఆయన రిక్వెస్ట్‌ను పరిగణనలోకి తీసుకుని యోధ డయాగ్నస్టిక్ సెంటర్‌వారు.. సినీ పరిశ్రమలోని అన్నీ శాఖల వారికి 50 శాతం రాయితీని తమ సెంటర్స్‌లో చేసే చికిత్సలకు ఇస్తున్నట్లు తెలిపారు. అందుకు సంబంధించిన రాయితీ హెల్త్ కార్డులను ఆదివారం చిరంజీవి సమక్షంలో చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌లో అందించారు. ఈ నేపథ్యంలో సినీ పరిశ్రమకు చిరంజీవిని పెద్దరికం వహించాలని కొందరు వ్యక్తులు కోరారు. దానికి చిరంజీవి మాట్లాడుతూ ‘‘పెద్ద రికం అనేది హోదాగానో మరోటిగానో అనిపించుకోవడం ససేమిరా నాకు ఇష్టం లేదు. నేను పెద్దగా ఉండను. బాధ్యత గల ఒక బిడ్డగా ఉంటాను. అవసరం వచ్చినప్పుడు నేనున్నాంటూ ముందుకు వస్తాను. అనవసరమైన విషయాలపై తగుదునమ్మా అని ముందుకొచ్చే ప్రసక్తే లేదు. సినీ ఇండస్ట్రీ పెద్దరికం అనేది నాకొద్దు. ఏ సమయంలోనైనా అవసరం వచ్చినప్పుడు బాధ్యత తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉంటాను. క్రైసిస్‌లో, ఇబ్బందుల్లో భుజం కాయాలని అనుకున్నప్పుడు నేను ముందుంటాను. అందరికీ అందుబాటులో ఉంటాను. ఇద్దరు ఎవరో కొట్టుకుని వచ్చి నన్ను తీర్చమంటే, అలాంటి తగువులు నేను తీర్చను. నాకొద్దు. ఆరోగ్య సమస్య, ఉపాధి సమస్య, మరో సమస్య ఏదైనా కానీ నేను పనిచేయడానికి సిద్ధం. అది కూడా పరిశ్రమను దృష్టిలో పెట్టుకుని ఉంటాను. అంతే కానీ, రెండు యూనియన్స్‌ను దృష్టిలో పెట్టుకునో, ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకునో నన్ను పంచాయతీ చేయమంటే నేను చేయను. అలాంటి పెద్దరికం నాకొద్దు. ఇండస్ట్రీ పెద్ద అని అనిపించుకోవడం నాకు పెద్ద ఇబ్బంది’’ అని చెప్పారు. చిరంజీవి చేసిన తాజా వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3FOjVL8
No comments:
Post a Comment