టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. నాటి హీరో, నిర్మాత అయిన రమేష్ బాబు ఘట్టమనేని కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో కన్నుమూశారు. సీనియర్ నటుడు కృష్ణ పెద్ద కుమారుడు, మహేష్ బాబు సోదరుడు అయిన రమేష్ బాబు మరణంపై టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో చిరంజీవి ట్విట్టర్ వేదికగా రమేష్ బాబు మరణంపై సంతాపాన్ని వ్యక్తం చేశారు. ‘‘ మరణవార్త వినగానే షాకయ్యాను. ఎంతో బాధ కలిగింది. కృష్ణగారికి, మహేష్‌కి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను. ఈ బాధాకరమైన పరిస్థితి నుంచి కోలుకునేలా ఆ భగవంతుడు ఆ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను’’ అన్నారు చిరంజీవి. సీనియర్ హీరో, నటుడు అయిన కృష్ణ పెద్దబ్బాయి రమేష్ బాబు. తండ్రి బాటలోనే సినిమా రంగంలోకి అడుగు పెట్టారు. తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే చిత్రంగా పేరున్న ‘అల్లూరి సీతారామరాజు’ చిత్రంలో యువ అల్లూరి పాత్రలో కనిపించి సినీ రంగ ప్రవేశం చేశారు రమేష్ బాబు. తర్వాత మరి కొన్ని చిత్రాల్లో బాల నటుడిగా కనిపించారు. ‘సామ్రాట్’ చిత్రంతో హీరోగా మారారు. మొత్తం 17 సినిమాల్లో నటించారు. కెరీర్ ప్రారంభంలో బజార్ రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు వంటి చిత్రాలు రమేష్ బాబుకు మంచి పేరుని తెచ్చి పెట్టాయి. తర్వాత ఆయన సినిమాలు సరిగ్గా ఆడకపోవడంతో సినిమా రంగానికి హీరోగా దూరమయ్యారు. కృష్ణ నటించిన ఎన్‌కౌంటర్ సినిమాలో కీలక పాత్రను పోషించారు. ఆ తర్వాత ఆయన నటనకు పూర్తిగా దూరమయ్యారు. ఆ తర్వాత నిర్మాతగా మారారు. తండ్రి పేరు మీదనే కృష్ణ ప్రొడక్షన్స్‌ను స్టార్ట్ చేశారు. దూకుడు, ఆగడు చిత్రాలకు రమేష్ బాబు సమర్పకుడిగా ఉన్నారు. తర్వాత సినీ రంగానికి ఎందుకనో దూరమయ్యారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3JTyTld
No comments:
Post a Comment