టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్ పిర్జాదా అభిమానులకు షాక్ ఇచ్చారు. చడీ చప్పుడూ లేకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైపోయారు. హర్యానా మాజీ ముఖ్యమంత్రి దివంగత భజన్ లాల్ మనవడు, ఆదంపూర్ ఎమ్మెల్యే కుల్దీప్ బిష్నోయి కుమారుడు, కాంగ్రెస్ యువ నేత భవ్య బిష్నోయిని మెహ్రీన్ పెళ్లాడబోతున్నారు. వీరి నిశ్చితార్థ వేడుక మార్చి 13న రాజస్థాన్‌లోని జైపూర్ అలీలా కోటలో ఘనంగా జరగనుంది. భవ్య బిష్నోయి గత లోక్‌సభ ఎన్నికల్లో హిసార్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి బ్రిజేంద్ర సింగ్‌పై చిత్తుగా ఓడిన భవ్య.. మూడో స్థానంలో నిలిచారు. బిష్నోయి ఫ్యామిలీపై బ్లాక్ మనీ ఆరోపణలు కూడా ఉన్నాయి. గతంలో కుల్దీప్ బిష్నోయి ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయ పన్ను అధికారులు సోదాలు నిర్వహించారు. లెక్కల్లో లేని సుమారు రూ.200 కోట్ల ఆస్తులు బిష్నోయి ఫ్యామిలీకి విదేశాల్లో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. రూ.30 కోట్ల మేర ఆదాయ పన్నును బిష్నోయి ఫ్యామిలీ ఎగ్గొట్టినట్టు అప్పట్లో ఐటీ అధికారులు కేసు నమోదు చేశారు. మరోవైపు, మెహ్రీన్ టాలీవుడ్‌లో మంచి పాపులారిటీ ఉన్న హీరోయిన్. ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ పంజాబీ మోడల్ తొలి సినిమాతో ఆకట్టుకున్నారు. ఆ తరవాత ‘మహానుభావుడు’, ‘రాజా ది గ్రేట్’ చిత్రాలతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక 2019లో వచ్చిన ‘F2’లో హనీ ఈజ్ ద బెస్ట్ అంటూ నవ్వించారు. గతేడాది ‘ఎంత మంచివాడవురా’, ‘అశ్వథ్థామ’ చిత్రాల్లో కనిపించారు. ఇప్పుడు ‘F3’లో నటిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, పంజాబీ చిత్రాల్లోనూ మెహ్రీన్ నటించారు. అయితే, భవ్యను పెళ్లాడిన తరవాత మెహ్రీన్ సినిమాలకు దూరమవ్వనున్నట్టు సమాచారం. ఎందుకంటే, గొప్పింటికి వెళ్తుంది కాబట్టి మెహ్రీన్ ఇకపై నటించకపోవచ్చు అంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tVypDm
No comments:
Post a Comment