
సంక్రాంతి అంటే తెలుగు ప్రజలకు పెద్ద పండుగ మాత్రమే కాదు సినిమా పండుగ కూడా. స్టార్ హీరోల అభిమానులు, సినీ ప్రేక్షకులు సంక్రాంతికి వచ్చే సినిమాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. స్టార్ హీరోలు సైతం సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేసుకుని సినిమాలను ప్లాన్ చేసుకుంటారు. వచ్చే సంక్రాంతి సీజన్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికే టార్గెట్ చేశారు. ఆయన హీరోగా పరుశురామ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ సంక్రాంతికి విడుదలకానుంది. అయితే, సంక్రాంతికి మరో స్టార్ హీరో సినిమా కూడా వస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ చిత్రం సంక్రాంతి బరిలో నిలిచింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ఆదివారం అధికారికంగా ప్రకటించింది. పవన్ కళ్యాణ్ 27వ సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. ప్రస్తుతానికి PSPK27గా పిలుస్తున్నారు. ఈ సినిమాను 2022 సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్ ఆదివారం ప్రకటించింది. ‘ఖుషి’ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్‌తో ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం నిర్మిస్తోన్న చిత్రం కావడం.. ఇప్పటి వరకు పోషించని పాత్రను పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో పోషిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. పీరియాడిక్ డ్రామాగా రూపొందుతోన్న ఈ చిత్రం సంక్రాంతి బరిలో నిలవడంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆసక్తి పెరిగిపోయింది. మహేష్ బాబు హీరోగా రూపొందుతోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘సర్కారు వారి పాట’ను పవన్ కళ్యాణ్ సినిమా ఢీకొట్టబోతోంది. కాబట్టి, ఈ సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద భారీ యుద్ధం ఖాయం. కాగా, పవన్ కళ్యాణ్ సినిమాకు యం.యం.కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3ku9fqY
No comments:
Post a Comment