Tuesday, 23 February 2021

చిరంజీవి సినిమాకు వెళ్లి సైకిల్ పోగొట్టుకున్న నాని.. మళ్లీ మెగాస్టార్ దగ్గరనుంచే రాబట్టి..!

చిన్న నాటి మధుర జ్ఞాపకాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఉంటాయి. వీటికి సినిమా స్టార్లు అతీతమేమీ కాదు. ప్రస్తుతం సూపర్ స్టార్లుగా కొనసాగుతున్న ఎంతో మంది హీరోలు చిన్న తనంలో అల్లరి చేసిన వాళ్లే.. సినిమాలకు వెళ్లినవాళ్లే.. టిక్కెట్ల కోసం చొక్కాలు చించుకున్నవాళ్లే. ఇలాంటి వాళ్లలో నేచురల్ స్టార్ నాని ఒకరు. మెగాస్టార్ చిరంజీవి అంటే పడిచచ్చిపోయే నాని.. తన చిన్నతనంలో చిరంజీవి సినిమాకు వెళ్లి తనకు ఎంతో ఇష్టమైన సైకిల్‌ను కోల్పోయారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మెగాస్టార్‌కు చెప్పారు. నాని పుట్టినరోజు సందర్భంగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేడు (ఫిబ్రవరి 24) నాని పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా నానికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఇది ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ క్లిప్పింగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ రియాలిటీ గేమ్ షోకి మొదట అక్కినేని నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించారు. మూడు సీజన్లను నాగార్జున హోస్ట్ చేయగా.. 2017లో ప్రసారమైన నాలుగో సీజన్‌కు మెగాస్టార్ చిరంజీవి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. చిరంజీవి హోస్ట్ చేసిన ఒక ఎపిసోడ్‌కి నేచురల్ స్టార్ నాని గెస్ట్‌గా విచ్చేశారు. అతిథులు కూడా చిరంజీవి అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పి డబ్బులు గెలుచుకోవడం తెలిసిందే. అయితే, ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో గెలిచిన డబ్బుతో మీరేం చేస్తారు అని నానిని చిరంజీవి అడిగారు. దీంతో తన చిన్ననాటి జ్ఞాపకాన్ని నాని గుర్తు చేసుకున్నారు. నాని కుటుంబం ఆయన చిన్నప్పుడే హైదరాబాద్‌లో స్థిరపడింది. అమీర్ పేట్ ఏరియాలో ఉండేవారు. తనకు సైకిల్ కావాలని గోల గోల చేస్తే.. హెరిక్యులస్ ఎంటీబీ సైకిల్ కొనిచ్చారట. అదే సమయంలో చిరంజీవి ‘మాస్టర్’ సినిమా విడుదల. అమీర్ పేట సత్యం థియేటర్‌లో సినిమా విడుదలవుతోంది. తన ఇంటి నుంచి సత్యం థియేటర్ అర కిలోమీటర్ దూరం కావడంతో సైకిల్ వేసుకుని నాని వెళ్లారు. షోకి గంట ముందు గేట్లు ఓపెన్ చేస్తారు కాబట్టి ముందుగానే నాని వెళ్లారట. జనం విపరీతంగా ఉన్నారట.. తోపులాట జరుగుతోందట. టిక్కెట్ దొరుకుతుందో లేదో అనే టెన్షన్‌లో సైకిల్ దూరంగా పార్క్ చేసి గేటు వద్దకు పరుగులు తీశారట నాని. అయితే, ఈ కంగారులో సైకిల్‌కి తాళం వేయడం మరిచిపోయారు. మొత్తానికి తోపులాటలోనే లైన్‌లో నిలబడితే టిక్కెట్ దొరికింది. బయటికి వచ్చి చూస్తే సైకిల్ పోయింది. అయితే, మామూలుగా అయితే చాలా బాధపడేవాడినని.. కానీ ‘మాస్టర్’ టిక్కెట్ దొరికిన కిక్‌లో సైకిల్ పోయిన బాధ చిన్నదైపోయిందని నాని అన్నారు. సినిమా చూసినంతసేపు ఏమీ అనిపించలేదని.. సినిమా అయిపోతున్న సమయంలో బాధ ప్రారంభమైందని నాని అన్నారు. దీంతో చిరంజీవి నవ్వు ఆపుకోలేకపోయారు. సంవత్సరం పాటు గోల చేస్తే కొనిచ్చిన సైకిల్ అట అది. సైకిల్ పోయింది కదా ఇప్పుడు ఎలా అని ఆలోచించి.. ఇంటి దగ్గర అబద్ధం చెప్పారట. సైకిల్ ఇంట్లోనే ఉండాలి నేను తీసుకెళ్లలేదు అని కవర్ చేశారట. అయితే, ఎప్పటికైనా చిరంజీవి ముందుకు వెళ్తే ఆయన్ని సైకిల్ అడగాలని ఆరోజే డిసైడ్ అయిపోయానని నాని మెగాస్టార్‌తో చెప్పారు. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’లో డబ్బులు గెలిస్తే సైకిల్ కోసం రూ.5 వేలు తీసుకొని మిగిలినవి చారిటీకి ఇచ్చేస్తానన్నారు. ‘‘భలే భలే మగాడివోయ్ సినిమా ఆడియో రిలీజ్‌లో అరవింద్ గారిని అడిగాను. మాస్టర్ సినిమాకు మీరు ప్రొడ్యూసర్.. కాబట్టి నా సైకిల్ నాకు ఇవ్వండి అన్నాను. తప్పకుండా గ్యారంటీ అని ఆరోజు మైక్‌లో చెప్పేసి ఇప్పటి వరకు నాకు సైకిల్ ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్‌గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను’’ అని చిరంజీవితో నాని అన్నారు. అరవింద్‌ను ఒప్పించి నానికి హెరుక్యులెస్ సైకిల్ ఇప్పించే బాధ్యత నాది అని చిరంజీవి మాటిచ్చారు. ఆ మాట ప్రకారమే నాని పోగొట్టుకున్న దాని కంటే ఖరీదైన గేర్ సైకిల్‌ను నాని ఇంటికి పంపారు. ఇది మూడేళ్ల క్రితం జరిగిన విషయం. నాని పుట్టినరోజు సందర్భంగా మళ్లీ ఇప్పుడు వైరల్ అవుతోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3qPHOdI

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...