వివాదాస్పద వీరుడు, సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ మరోసారి సెన్సేషనల్ మూవీ సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా రాయలసీమ, ఆంధ్రా రాజకీయాలు, అక్కడి రాజకీయ వేత్తల రియల్ స్టోరీలపై మూవీలు రూపొందించి చర్చల్లో నిలిచిన ఆర్జీవీ.. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలపై ఫోకస్ పెట్టారు. ఈ మేరకు కొండా దంపతులపై సినిమా ప్రకటించారు. ఎన్‌కౌంటర్‌లో చంపబడిన నక్సలైట్ ఆర్.కె అలియాస్ రామకృష్ణకి, కొండా మురళికి ఉన్న ప్రత్యేక సంబంధం గురించి ఈ సినిమాలో చెప్పబోతున్నట్లు తెలుపుతూ సరికొత్త సంచలనానికి తెరలేపారు వర్మ. కొండా సురేఖ-మురళి దంపతుల బయోపిక్ రూపొందించడం కోసం ఇప్పటికే సీక్రెట్‌గా వరంగల్ పర్యటన చేసిన వర్మ.. అక్కడి ఎల్బీ కళాశాలలో అధ్యాపకులను, సిబ్బందిని కలిసి కొంతసేపు రహస్యంగా చర్చలు జరిపి కీలక సమాచారం సేకరించారని విన్నాం. పలువురు కీలక నేతలను కలిసి ఒక్కప్పటి వరంగల్ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిన కొండా సురేఖ-మురళి దంపతులకు సంబంధించిన కీలక విషయాలను సేకరించారు ఆర్జీవీ. కొండా దంపతులను కూడా కలిసి వారి జీవితం, తెలంగాణ పరిస్థితులపై సినిమా తీస్తున్నట్లు చెప్పి అంగీకారం తీసుకున్నారు. ఈ మేరకు తాజాగా వీడియోలో వర్మ చెప్పిన విషయాలు వింటుంటే ఈ మూవీ రాజకీయ వర్గాల్లో ఓ సంచలనం సృష్టిస్తుందని తెలుస్తోంది. తాను తీస్తున్నది సినిమా కాదని, నమ్మశక్యం కాని నిజ జీవితాల ఆధారంగా తెలంగాణలో జరిగిన ఒక రక్త చరిత్ర అని పేర్కొన్న వర్మ.. 1995లో జరిగిన ఆ చరిత్ర కోరలు ఇప్పటి రాజకీయాలను కరుస్తూనే ఉన్నాయని అన్నారు. మున్ముందు రాజకీయాలను కూడా కరుస్తూనే ఉంటాయి. 'ఎందుకంటే విప్లవం అనేది ఎప్పటికీ ఆగదు' అని ఆయన చెప్పిన విధానం చూస్తుంటే ఈ మూవీ వరంగల్‌లో ఎంతటి కాంట్రవర్సీ అవుతుందనేది ఊహించడం కష్టమే అనిపిస్తోంది. వరంగల్ రాజకీయ వేత్తల్లో రెబల్స్ ఈ కొండా దంపతులు. రాజకీయాల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ, ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా పొలిటీషియన్స్‌గా తమ మార్క్ చూపించారు. వీరి జీవిత ప్రయాణంలో ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఈ కాన్సెప్ట్ తీసుకొని వర్మ సినిమా రూపొందిస్తుండటం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3EXTUbY
No comments:
Post a Comment