తెలంగాణలోని నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతానికి చెందిన కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా మార్మోగిపోతోంది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఆయనకు పవన్ కల్యాణ్, దగ్గుబాటి రానా కలయికలో రూపొందుతున్న చిత్రం ‘బీమ్లా నాయక్’లో టైటిల్ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. పవన్ కళ్యాన్ పుట్టినరోజు సందర్భంగా గురువారం ఆ పాటను యూట్యూబ్‌లో విడుదల చేయగా 10 గంటల్లో 6 లక్షల మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ఈ పాటలో ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ ఓ వ్యక్తి కనిపిస్తాడు. అంతరించిపోతున్న కళకు ఊపిరిలూదుతున్న ఆ అరుదైన కళాకారుడే మొగులయ్య. ఆయన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలంలోని అవుసలికుంట. తండ్రి ఎల్లయ్య నుంచి వారసత్వంగా వచ్చిన ఏడు మెట్ల కిన్నెరను పన్నెండు మెట్లుగా మార్చి ప్రదర్శనలిచ్చేవారాయన. అంతరించిపోతున్న కిన్నెర వాద్య కళను కాపాడుతున్న మొగులయ్యను తెలంగాణ ప్రభుత్వం గుర్తించి... ఉగాది పురస్కారంతో ఘనంగా సత్కరించింది. అంతేకాదు ఆయన జీవిత గమనాన్ని ఎనిమిదో తరగతిలో పాఠ్యాంశంగా ప్రవేశపెట్టింది. కరోనా పరిస్థితుల్లో ఊరూరా ప్రదర్శనలివ్వలేక మొగులయ్య కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆయన దీనస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించి నెలకు రూ.10వే చొప్పున ఫించన్ ఇస్తోంది. మొగులయ్య గురించి తెలుసుకున్న పవన్ కళ్యాణ్ ఆయన్ని చెన్నై పంపించి తన సినిమా కోసం ప్రత్యేకంగా పాట పాడించారు. ఆ పాటను తమిళనాడు అడవుల్లో మొగులయ్యపైనే చిత్రీకరించారు. తాను ఎక్కువగా పాడే ‘పాన్‌గల్ మియా సాబ్’ పాట శైలిలోనే రాసిన ‘భీమ్లానాయక్’ పాట విశేష ఆదరణ పొందడంపై మొగులయ్య సంతోషం వ్యక్తం చేశారు. తనను ప్రోత్సహిస్తున్న వారికి, సినిమాలో పాడేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3zMdVPW
No comments:
Post a Comment