Sunday, 31 January 2021

65వ పడిలోకి తెలుగువారి ఆనందం బ్రహ్మానందం.. హాస్య బ్రహ్మ సినీ జర్నీలో మైలురాళ్లు ఎన్నో ఎన్నెన్నో..!

బ్రహ్మానందం.. ఈ పేరు వినబడితే చాలు తెలుగు వారి మదిలో ఆనందం చిగురిస్తుంటుంది. తనదైన ఎక్స్‌ప్రెషన్స్, కడుపుబ్బా నవ్వించే డైలాగ్స్‌తో వెండితెరపై హాస్యం పండించడంలో తనకు సాటెవ్వరూ లేరని నిరూపించారు . కోట్లాదిమంది ప్రేక్షకులను ఇట్టే రిలాక్స్ చేసే ఓ కామెడీ టానిక్ ఆయన. మూడున్నర ద‌శాబ్ధాల కెరీర్‌లో దాదాపు 1000కి పైగా సినిమాల్లో నటించిన ఆయన.. స్టార్ హీరోలను మించిన పాపులారిటీ సంపాదించారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి అలాంటి కామెడీ కింగ్ పుట్టినరోజు అంటే మామూలుగా ఉంటుందా!. సోషల్ మీడియా హోరెత్తిపోవాల్సిందే.. ఈ రోజు (ఫిబ్రవరి 1) ఆయన పుట్టినరోజు. నేటితో 64 సంవత్సరాలు పూర్తిచేసుకొని 65వ పడిలోకి అడుగుపెడుతున్నారు బ్రహ్మానందం. దీంతో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఎక్కడ చూసినా ఆయన బర్త్ డే విషెస్ మాత్రమే దర్శనమిస్తున్నాయి, హాస్యానికి పెట్టింది పేరు మీరంటూ సాధారణ ప్రజలు మొదలుకొని సెలబ్రిటీల వరకు ఆయనపై ప్రశంసల వర్షం గుప్పిస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ 1956 సంవత్సరంలో గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో బ్రహ్మానందం జన్మించారు. ఆయన తండ్రి కన్నెగంటి నాగలింగాచారి, తల్లి పేరు కన్నెగంటి లక్ష్మీనరసమ్మ. చదువులో ముందంజలో ఉండే ఆయన మాస్టర్ ఆఫ్ డిగ్రీ తెలుగు చేసి అత్తిలిలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే మిమిక్రీ చేస్తూ పలు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగమయ్యేవారు. స్టేజ్ షోలలో ప్రదర్శనలు ఇస్తూ భేష్ అనిపించుకునేవారు. ఈ క్రమంలోనే జంధ్యాల రూపొందించిన ‘ఆహా నా పెళ్లంట' సినిమాలో 'అరగుండు' అనే పాత్రతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు బ్రహ్మానందం. ఆ సినిమాలో బ్రహ్మానందం కామెడీ టైమింగ్ చూసి ఫిదా అయిన దర్శకనిర్మాతలు వరుస ఆఫర్స్ ఇవ్వడంతో ఇక తన సినీ కెరీర్‌లో వెనుతిరిగి చూడలేదు బ్రహ్మానందం. బ్రహ్మి అంటూ ప్రేక్షకుల చేత ముద్దుగా పిలిపించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఖాన్ దాదా, బద్దం భాస్కర్, కిల్ బిల్ పాండే, కత్తి రాందాసు, శంకర్ దాదా ఆర్ఎంపీ, చిత్రగుప్తుడిగా, నెల్లూరు పెద్దారెడ్డి, శాస్త్రి, చారి, హల్వారాజ్‌, ప్రణవ్‌, బాబీ, జిలేబీ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పోషించిన విలక్షణ కామెడీ రోల్స్ ఎన్నో ఎన్నెన్నో. ఎన్టీఆర్, ఏఎన్నార్.. ఆ తర్వాత చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్.. ఇక నేటితరం హీరోలు నాగ చైతన్య, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు ఇలా మూడు తరాల హీరోలతో నటించి ఎప్పటికప్పుడు ట్రెండ్‌కి తగ్గట్టు నవ్వుల పంట పండించారు బ్రహ్మానందం. నటుడిగా పరిచయం చేసిన 'అహ నా పెళ్లంట' చిత్రమే 1987లో ఈయనకి తొలి నంది పురస్కారాన్ని కూడా సాధించిపెట్టింది. ఆ తర్వాత ఆయన కెరీర్‌లో ఐదు నందులు, ఒక ఫిల్మ్ ఫేర్, సైమా, ‘మా' అవార్డులతో పాటు 2010లో పద్మ శ్రీ పురస్కారం దక్కింది. వివిధ భాషలలో వెయ్యికి పైగా సినిమాలలో నటించి 2010లో గిన్నిస్ రికార్డుల్లో కూడా తన పేరు లిఖించుకున్నారు బ్రహ్మి. తెలుగులో కామెడీ రారాజుగా కిరీటం దక్కించుకున్న బ్రహ్మానందం.. ఇటీవలి కాలంలో సినిమాలు తగ్గించేశారు. ఒకప్పుడు దూకుడుగా సినిమాలు చేసిన ఆయన, వయసు మీదపడటంతో తన సినీ ప్రస్థానాన్ని కాస్త నెమ్మది చేశారు. ఇక ఈ నవ్వుల మహారాజుతో దాగిఉన్న మరో టాలెంట్ చిత్రలేఖనం. అద్భుతమైన చిత్రకళ తనలో ఉందని ఇటీవలే ప్రేక్షకలోకానికి చూపించి మెప్పించారాయన. ప్రస్తుతం బ్రహ్మానందం కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘రంగమార్తాండ’ సినిమాలో నటిస్తున్నారు. సో.. నేడు బ్రహ్మానందం పుట్టినరోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా 'సమయం తెలుగు' తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3oBupnE

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...