Thursday 20 February 2020

అందుకే నాపేరు భక్తవత్సలం.. తన పుట్టుక గురించి రహస్యం చెప్పిన మోహన్ బాబు

ప్రముఖ నటుడు, నిర్మాత, పద్మశ్రీ అవార్డు గ్రహీత మంచు మోహన్ బాబు అసలు పేరు భక్తవత్సలం నాయుడు అని అందరికీ తెలిసిందే. అసలు తనకు ఆ పేరు ఎందుకు పెట్టారు అనే విషయాన్ని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా దాని విశిష్టతను వివరిస్తూ తనకు, శివుడికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తూ తెలుగు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపారు. తాను ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో పుట్టానని చెప్పారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ‘‘మహాశివరాత్రి అత్యద్భుతమైన రోజు. ముఖ్యంగా మా కుటుంబం గుర్తుపెట్టుకోవల్సిన రోజు. ఎందుకంటే మాది తిరుపతి-కాళహస్తిల మధ్య చిన్న పల్లెటూరు మోదుగుళ్లపాలెం. మా అమ్మానాన్నలకు వివాహమై ఎన్నో ఏళ్ళు సంతానం కలగకపోతే ఎవరో చెప్పారట, ఇక్కడకి ఒక 5 కిలోమీటర్లు నడిచి, మరో 5 కిలోమీటర్లు కొండెక్కితే అడవిలో బత్తినీయస్వామి అని లింగాకారంలో ఉన్నటువంటి ఈశ్వరునికి మొక్కుకుంటే పిల్లలు పుడతారని. ఆ భగవంతుడిని దర్శించుకుని వచ్చారు, మా అమ్మకు ఐదుగురు సంతానం కలిగారు. అందుకనే నా పేరు భక్తవత్సలం అని పెట్టారు మా నాన్నగారు. ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చాక మోహన్ బాబుగా మారింది. అదీ రహస్యం, నాకు ఈశ్వరుడికి ఉన్న అనుబంధం. ఆయన ఆశీస్సులతో పుట్టినవాడిని నేను, మా కుటుంబమంతా ఆయన ఆశీస్సులతో పుట్టినవాళ్ళమే. అందుకు మహాశివరాత్రి చాలా మంచి పర్వ దినం. అందరికీ ఆ పరమేశ్వరుని కరుణ కటాక్షాలు కలగాలని కోరుకుంటూ - మీ మోహన్ బాబు’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SVvp88

No comments:

Post a Comment

THE MUST READ REKHA INTERVIEW!

'At one time, I felt being a mother was the ultimate experience, a woman was not complete without it.' from rediff Top Interviews ...