ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అంశం చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. అమరావతితో పాటు విశాఖపట్నం, కర్నూలు నగరాలను రాజధానులుగా మార్చనున్నట్టు వై.ఎస్.జగన్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే, ఈ మూడు రాజధానుల నిర్ణయంపై మిశ్రమ స్పందన వచ్చింది. వైఎస్సార్‌సీపీ వర్గం ఇదొక చారిత్రాత్మక నిర్ణయం అంటుంటే.. జనసేన, టీడీపీలు మాత్రం పనికిమాలిన నిర్ణయం అంటూ విమర్శలు చేస్తున్నారు. ఇక, అమరావతి రాజధాని రైతులు అయితే జగన్ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఉద్యమమే చేస్తున్నారు. ఇదిలా ఉంటే, జగన్ మూడు రాజధానుల నిర్ణయానికి సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు లభించింది. మెగాస్టార్ చిరంజీవి నేరుగా వై.ఎస్.జగన్‌ను కలిసి తన మద్దతు తెలియజేశారు. అయితే, ఇండస్ట్రీకే చెందిన సీనియర్ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాత్రం జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో మూడు కాకపోతే 30 రాజధానులు పెట్టుకోండంటూ వ్యాఖ్యానించారు. Also Read: ‘1978 పలాస’ సినిమా ట్రైలర్, సాంగ్ విడుదల కార్యక్రమం ఆదివారం విశాఖపట్నంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమ్మారెడ్డి భరద్వాజ విలేకరులతో మాట్లాడుతూ బస్సు వేసుకుని తిరిగిన చోట్లన్నీ రాజధానులు అని చెప్పమనండని ఎద్దేవా చేశారు. ఎక్కడ నుంచి పాలన జరిగితే అదే రాజధాని అవుతుందే తప్ప కొత్తగా పేరు పెట్టినంత మాత్రాన రాజధానులు కావన్నారు. ‘‘మంచికో, చెడుకో అమరావతి రాజధాని అంటూ సుమారు రూ.7000 కోట్ల ప్రజాధనం వెచ్చించారు. మరో రూ.2000 కోట్ల పెడితే అక్కడ నిర్మిస్తున్న కట్టడాలు పూర్తవుతాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఏదో ఒక సమస్యను తెస్తున్నారు’’ అని తమ్మారెడ్డి అన్నారు. గతంలో ప్రత్యేక హోదా కోసం పోరాటం చేసిన వారిని అప్పటి ప్రభుత్వం అరెస్ట్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రాజధాని విషయాన్ని పక్కనపెడితే.. అసెంబ్లీలో నేతలు బూతులు తిట్టుకుంటున్నారని, బయటకెళితే తెలుగువారిమని చెప్పుకునేందుకు సిగ్గుపడాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2STRQMr
No comments:
Post a Comment