యంగ్ హీరో రాజ్ తరుణ్ హిట్ అందుకుని చాలా కాలం అయ్యింది. ‘కుమారి 21ఎఫ్’ తరవాత రాజ్ తరుణ్ పది సినిమాలు చేసినా ఏ ఒక్కటీ సరిగా ఆడలేదు. అయినప్పటికీ రాజ్ తరుణ్‌కి అవకాశాలు తగ్గలేదు. కిందటేడాది ‘లవర్’ సినిమాతో అవకాశం ఇచ్చిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు.. ఇప్పుడు ‘ఇద్దరి లోకం ఒకటే’ అనే సినిమా ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించింది. విషాదాంత ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా క్రిస్మస్ కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టాలీవుడ్‌లో బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు నిర్మించిన సినిమా అయినప్పటికీ ‘ఇద్దరి లోకం ఒకటే’కు పెద్దగా బజ్ లేదు. రాజ్ తరణ్ తన సొంతూరు వైజాగ్‌లో పర్యటించడం మినహా ఎలాంటి ప్రమోషన్స్ చేయట్లేదు. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయడానికి ఒక్కరోజు ముందు యూస్‌లో ప్రీమియర్ షోలు వేసేస్తారు. అంటే, ఇక్కడ విడుదల రోజు తెల్లవారుజామున సినిమా టాక్ తెలిసిపోతుంది. కానీ, ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమా టాక్ ఇప్పటికీ సరిగా తెలియడంలేదు. దీనికి కారణం అక్కడ తక్కువ లొకేషన్లలో ప్రీమియర్లు వేయడమే. కేవలం మూడు లొకేషన్లలో ‘ఇద్దరి లోకం ఒకటే’ ప్రీమియర్లు వేస్తున్నారు. ఈ సినిమాకు యూఎస్‌లో ప్రీమియర్ల ద్వారా మంగళవారం రాత్రి 10 గంటల వరకు కలెక్ట్ అయిన మొత్తం కేవలం 324 డాలర్లు. అదే, ‘ప్రతిరోజూ పండగే’ సినిమాకు 47,745 డాలర్లు వచ్చాయి. 48 లొకేషన్లలో ఈ సినిమాను ప్రదర్శిస్తున్నారు. ‘రూలర్’కి సైతం 18 లొకేషన్లలో మంగళవారం 3040 డాలర్లు వసూలయ్యాయి. ఈ లెక్కలు చెబుతున్నాయి ‘ఇద్దరి లోకం ఒకటే’ సినిమాకు బజ్ ఏ స్థాయిలో ఉందో. మరోవైపు యూఎస్ నుంచి వస్తోన్న టాక్ కూడా అంత గొప్పగా లేదు. సినిమా పెద్దగా ఎంటర్‌టైనింగ్‌గా లేదని అంటున్నారు. ఇది చాలా సీరియస్‌గా సాగే లవ్ స్టోరీ అట. ఫస్టాఫ్ పర్వాలేదనిపించినా సెకండాఫ్‌ను భరించడం కష్టమట. 90ల్లో సినిమాల మాదిరిగా మెలోడ్రమాటిక్‌గా ఉందని టాక్. మిక్కీ జే మేయర్ పాటలు మినహా సినిమాలో గొప్పగా చెప్పుకోవడానికి ఏమీ లేదని అంటున్నారు. కామెడీ అస్సలు లేకపోవడం, సెంటిమెంట్ వర్కౌట్ కాకపోవడం సినిమాకు పెద్ద మైనస్ అట. రాజ్ తరుణ్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడట. షాలినీ పాండే చాలా అందంగా కనిపించిందని, అంతే అందంగా నటించిందని అంటున్నారు. చాలా తక్కువ బడ్జెట్‌తో తక్కువ క్యాస్టింగ్‌తో చాలా సింపుల్‌గా సినిమాను తీసేశారట. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిలవడం కష్టమే అంటున్నారు. మరోవైపు ఇప్పటికే కొంత మందికి ప్రివ్యూ షోలు వేసి చూపించారు దిల్ రాజు. కాలేజీ స్టూడెంట్స్ అయితే సినిమా అద్భుతంగా ఉందని చెప్పారు. హార్ట్ టచ్చింగ్ అన్నారు. సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ సైతం సినిమా చాలా బాగుందని చెప్పారు. కానీ, యూఎస్ నుంచి వస్తోన్న టాక్ దీనికి విరుద్ధంగా ఉంది. చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో టాక్ ఎలా ఉంటుందో!!
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Svg6Ey
No comments:
Post a Comment