తమిళంలో సూపర్ హిట్ అయిన పాటను తెలుగులోనూ డబ్ చేయడం అంటే మామూలు విషయం కాదు. తమిళంలోని పదాలు వేరు.. తెలుగులో వాడే పదాలు వేరు. భావాన్ని చెడగొట్టకుండా తెలుగు ప్రేక్షకుల మనసుకు తాకేలా రాయగలగడం కత్తి మీద సాము వంటిది. అలా సినిమాలోని అనే పాట రెండు తెలుగు రాష్ట్రాలను ఓ ఊపు ఊపేసింది. తమిళంలో సూరారై పొట్రూ అంటూ వచ్చిన సినిమాను ఆకాశం నీ హద్దురా అనే పేరుతో డబ్ చేసిన సంగతి తెలిసిందే. కాటుక కనులే అనే పాటను రాయడం, రాసిన ఆ సంద్బర్భం, వాడిన ఆ పదాల గురించి తాజాగా ఓ మీడియాతో పంచుకున్నారు. పల్లవిని ప్రారంభించడం నుంచి చివరి లైన్ వరకు ప్రతీ పదానికి ఓ అర్థం, సందర్భం ఉందని చెప్పుకొచ్చారు. తమిళంలో రికార్డ్ చేసిన పాటను తనకు వినిపించారని భాస్కర భట్ల చెప్పుకొచ్చారు. ‘ఈ నాయిక బిడియమంటే తెలియని అమ్మాయి. కథానాయకుడిలానే తాను సొంత సంస్థని నడపాలనుకుంటుంది. అందుకే నాయకుడిపైన ఇష్టమున్నా వద్దంటుంది. అలాంటమ్మాయిని హీరో రెండేళ్ల తరువాత వెతుక్కుంటూ వస్తే తనలో ఉప్పొంగే ప్రేమే ఈ పాట సందర్భం’ అని దర్శకులు సుధా కొంగర వివరించారట. కాటుప్పయలే (మొరటోడ) అని తమిళంలో మొదలవుతుందని దాన్ని అలానే తర్జుమా చేయకుండా ఆ శబ్దానికి దగ్గరగా ఉండేలా కాటుక కనులే మెరిసి పోయే అన్న పల్లవితో శ్రీకారం చుట్టాను అని భాస్కర భట్ల అసలు విషయం చెప్పారు. జాతర్లో పూనకాలు వస్తే ఒంటిపైన వేపాకులు పోస్తుంటారు. ఉగ్రస్వరూపిణిలాంటి ఈ నాయికకి ప్రేమ అనే పూనకం వచ్చింది కాబట్టి ‘వేపచెట్టు ఆకులన్ని గుమ్మరించినట్టు ఈడుకెంత జాతరొచ్చెరా!’ అని పెట్టానని అన్నారు. ఈ నాయిక అవకాశమిస్తే ప్రపంచాన్నే చుట్టేయగల అమ్మాయి. అలాంటి ఆమె ఎదురుచూపుల పరిధి చాలా పెద్దది. అందుకే ఓ పెద్ద గాలిగోపురం పై నుంచి చూసే పక్షికి పోలికకి తెచ్చుకున్నాను. ‘గోపురాన వాలివున్న పావురాయిలా ఎంత ఎదురుచూసినానో అన్ని దిక్కులా’ అని చరణం మొదలిపెట్టాను అంటూ పాట గురించి చెప్పుకొచ్చారు. నువ్వు వొచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టిగుండె గంతులేసే జింకపిల్లలా అని రాశాను. కానీ జింకపిల్ల అన్నది మరీ అరిగిపోయిన పదంలా అనిపించింది. ఇంకేదైనా రాద్దామని రకరకాలుగా అనుకున్నాక చెవుల పిల్లిలా (కుందేలు) అని పెట్టాను. అదే చరణంలో హీరో చూపుని సూదితోనూ, నవ్వుని దారంతోనూ పోల్చి ఆ రెండింటితో నన్ను నీతో కలిపి కుట్టేయరా అన్న ఉపమానం దర్శకురాలికి బాగా నచ్చితే ఆ తరువాతి ‘ముద్దుబొట్టు’ అన్న ప్రయోగం నాకు సంతృప్తినిచ్చింది అని భాస్కర భట్ల అన్నారు. ఈ అమ్మాయి తనలోని ప్రేమావేశాన్ని చెప్పిన వైనం విన్నవాళ్లకి ‘మరీ అతిగా చేస్తోందే’ అన్న చులకన కలగొచ్చు. అలా జరగకూడదనుకున్నాను. చరణంలో చివరి పాదంలో ‘నిన్ను గుచ్చుకుంటా ఆఆ.. నల్లపూసలాగా’ అన్నది మొదటివాక్యం. ఈ నల్లపూసకి రైమ్ కుదిరేలా ఇట్టేకరిగిపోయే ‘వెన్నపూస’ అనడం సులువు. కానీ అలా చేస్తే నాయిక ప్రత్యేకత ఏముంటుంది. అందుకే ‘అంటిపెట్టుకుంటా వెన్నుపూసలాగా’ అని వాడాను. ఆ పదంతో హీరోయిన్‌తో పాటు పాట స్థాయి కూడా పెరిగిపోయింది అని భాస్కర భట్ల పాటను పూస గుచ్చినట్టు వివరించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gC5CiN
No comments:
Post a Comment