Sunday 15 November 2020

గొడవతోనే మా పరిచయం మొదలు.. నేను చేయనని రాజమౌళికి చెప్పేశా: ఎన్టీఆర్ గురించి రాజీవ్ కనకాల

యంగ్ టైగర్ ఎన్టీఆర్, నటుడు ఎంత మంచి స్నేహితులో అందరికీ తెలిసిందే. ‘స్టూడెంట్ నెంబర్ 1’ మొదలుకొని ఇంచుమించుగా హీరోగా వచ్చిన ప్రతి సినిమాలో రాజీవ్ కనకాల నటించారు. నిజానికి ఎన్టీఆర్, రాజీవ్ మధ్య వయసులో సుమారు 14 ఏళ్ల వ్యత్యాసం ఉంది. కానీ, ఒకరికొకరు మంచి స్నేహితులు. అసలు వీళ్ల పరిచయం ఎలా ఏర్పడింది.. స్నేహం ఎలా బలపడింది వంటి విషయాలను తాజాగా రాజీవ్ కనకాల పంచుకున్నారు. ఈ మేరకు ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘స్టూడెంట్ నెంబర్ 1’ షూటింగ్‌లో ఫస్ట్ డే గొడవతో తమ పరిచయం మొదలైందని రాజీవ్ చెప్పారు. ‘‘ఫిలిం సిటీలో షూటింగ్ చేస్తున్నాం. ఫస్ట్ సీన్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేశారు. మెట్లపై భయ్యా భయ్యా అంటూ ఎన్టీఆర్ వచ్చే సీన్. మధ్యాహ్నం లేస్ గార్డెన్ దగ్గర షూటింగ్‌కు వెళ్లాం. సినిమా వారపత్రికలో పుస్తకం పెట్టుకుని ఎన్టీఆర్ చదువుతూ ఉంటాడు. ఆ సీక్వెన్స్ చేస్తున్నాం. ఆర్టిస్ట్ చంద్రశేఖర్ (గెడ్డం శేఖర్) ఒక కళ్లజోడు కొనుక్కొని తెచ్చుకున్నాడు. సికింద్రాబాద్‌లో 80, 90 రూపాయలకు దొరికే కళ్లజోడు అది. ఆ కళ్లజోడు నా క్యారెక్టర్‌కు సరిపోతుందేమోనని శేఖర్‌ను అడిగి తీసి పెట్టుకున్నాను. ఎదురుగా కూర్చున్న ఎన్టీఆర్.. ‘ఛ, కళ్లజోడు అవసరమా’ అన్నాడు. నన్నే అంటాడా? అనుకున్నాను. ఆ అవసరం, అందుకే పెట్టుకున్నాను అని అన్నాను. నాకు అర్థమైపోయింది. ఇంకేదో కెలుకుతాడు అనిపించింది. ఆరోజు సాయంత్రం వెళ్లి జక్కన్నకు చెప్పేశాను. నీకు దండం పెడతాను నన్ను వదిలేయ్, రెండే సీన్లు అయ్యాయి, ఇంకెవరినైనా చూసుకో, పైగా హరికృష్ణ గారి అబ్బాయి, నేనేమో ఆగను, ఏదో ఒకటి అంటాను, వద్దు జకన్న అని అన్నాను. ఏదో సరదాగా అనుంటాడు, వదిలేయ్, అన్నీ సీరియస్‌గా తీసుకుంటావు అని జక్కన్న అన్నాడు. ఆ తరవాత రోజు చూస్తే పూర్తిగా మారిపోయాడు, అపరిచితుడు. రాజీవ్ గారు గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. మర్యాదలో ఇంకో స్థాయిలో ఉన్నాయి. ఏంటిది అని నాకు అర్థం కాలేదు. మూడో రోజు మళ్లీ ఏదో కెలికాడు. ఇక నాకు అర్థమైపోయింది.. చచ్చినట్టు నేను చేయాలి ఈ సినిమా అని. ఇక ఏం జరిగినా తప్పుకునే ఛాన్స్ లేదు. అయితే, తొలి షెడ్యూల్ అయిపోయిన తరవాత రెండో షెడ్యూల్‌కు బాగా క్లోజ్ అయ్యాం. అక్కడి నుంచి తిరిగి చూసుకోలేదు’’ అని రాజీవ్ కనకాల వెల్లడించారు. ఎన్టీఆర్ ప్రతి సినిమాలోనూ రాజీవ్ ఉంటాడని.. దానికి తారక్ కారణమా అన్న ప్రశ్నకు కూడా రాజీవ్ స్పందించారు. ‘‘అది నిజంగా నాకూ తెలీదు. తనే చెప్పాడా లేదా ఏమో. నిజానికి హీరోకి తెలియకుండా ఏదీ జరగదు. మొదట్లో అయితే నేను కచ్చితంగా ఉండాలని పట్టుబట్టేవాడు. నేను ‘విష్ణు’ సినిమా చేస్తున్నాను. సారథి స్టూడియోలో ‘ఆంధ్రావాలా’ షూటింగ్ జరుగుతోంది. రాజా కావాలని పట్టుబట్టాడు. నేను మూడు రోజుల తరవాత జాయిన్ అయ్యాను. పూరి చెప్పారు క్యారెక్టర్ ఏం లేదమ్మా కానీ తారక్ చెప్పాడని అని అన్నారు. వెనక అందరి మధ్య నిలబడటమే. అలాగే, నేను ‘నువ్వే నువ్వే’ షూటింగ్‌లో ఉన్నాను. అన్నవరంలో జరుగుతోంది. నెల్లూరు నుంచి ఫోన్ చేశాడు. నువ్వు అర్జెంట్‌గా రావాలని అన్నాడు. నేను ఇప్పుడు ఎలా వస్తాను అంటే.. నాకు తెలీదు నువ్వు రావాల్సిందే అన్నాడు. మొత్తం మీద మేనేజర్లతో మాట్లాడించి ఓకే చేశాడు. త్రివిక్రమ్ గారు కూడా అర్థం చేసుకున్నారు. తారక్ ఎంత తుంటరోడంటే.. నాకు జుట్టు సైడ్ మొత్తం తీయించేశాడు. ముందు బ్లీచ్ చేయించేశాడు. ఇదంతా ఎందుకంటే ఇక ఎక్కడికీ పోడానికి వీళ్లేదు. చచ్చినట్టు అతని సినిమానే చేయాలి’’ అని తన అనుభువాలను చెప్పుకొచ్చారు రాజీవ్. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UrO1hd

No comments:

Post a Comment

'Will Keep Working To Grow Value Of New Businesses'

'Margins will be an outcome of that. They will likely remain somewhat range-bound.' from rediff Top Interviews https://ift.tt/mfch...