సాహిత్య దిగ్గజం ఇకలేరని తెలిసి యావత్ సినీ లోకం శోక సంద్రంలో మునిగిపోయింది. ఆయన కలం నెలకొరిగిందని తెలిసి సినీ ప్రముఖులు షాకయ్యారు. నిన్న (మంగళవారం) సాయంత్రం 4 గంటల 7 నిమిషాలకు సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో ఆయన కన్నుమూశారు. సిరివెన్నెల మరణ వార్త వినగానే పలువురు సినీ ప్రముఖులు ఆసుపత్రి వద్దకు చేరుకొని విచారం వ్యక్తం చేశారు. అయితే సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఈ రోజు (బుధవారం) ఆయన భౌతిక కాయాన్ని ఫిలింనగర్ లోని ఫిలిం చాంబర్‌లో ఉంచారు. ఉదయం 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా సిరివెన్నెలను కడసారి చూసేందుకు అభిమానులు పోటెత్తగా.. పలువురు సినీ ప్రముఖులు వచ్చి ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చుతూ సిరివెన్నెలకు నివాళులు అర్పించారు. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, మహేష్ బాబు, తనికెళ్ళ భరణి, అల్లు అర్జున్, చిరంజీవి, రావు రమేశ్, వెంకటేష్, మణిశర్మ, గుణశేఖర్, సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, బాలకృష్ణ తదితరులు సిరివెన్నెల భౌతిక కాయానికి నివాళులర్పించి ఆయనతో ఉన్న జ్ఞాపకాలు నెమరు వేసుకున్నారు. సిరివెన్నెల భౌతిక కాయాన్ని చూశాక సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు. స్రవంతీ మూవీస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తు చేసుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని, ఆయన పాటల ప్రకాశం తెలుగుజాతి ఉన్నంత వరకు ఉంటుందని కన్నీటితో తడిసిన ముఖంతో చెప్పారు తనికెళ్ళ భరణి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3G6GhHx
No comments:
Post a Comment