Friday, 6 November 2020

హాస్యానికి ‘రాజా’బాబు.. నీళ్లు తాగి కడుపు నింపుకుని.. రూ.లక్షల్లో పారితోషికం స్థాయికి

మానవత్వం మనిషి లక్షణం. అది లేకపోతే అసలు మనిషే కాదు. కానీ మానవత్వం శ్రుతిమించితే మనిషి రోడ్డుప పడతాడనటానికి ప్రత్యక్ష నిదర్శనం అలనాటి హాస్యనటుడు రాజబాబు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లాంటి అగ్రహీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న చివరికి దిక్కుతోచని రీతిలో మరణించడం ఆయన అభిమానులనే కాదు యావత్ సినీ ప్రేక్షకులను కంటతడి పెట్టించింది. ఓ సినిమాలో హీరోగా ఎన్టీఆర్ పారితోషికం 35వేల రూపాయలైతే రాజబాబుకు పారితోషికంగా రూ.20వేలు నిర్ణయించారు నిర్మాత. దీంతో కోపం తెచ్చుకున్న రాజబాబు తనకూ 35వేల రూపాయలు కావాల్సింసిందేనని పట్టుపట్టాడు. ఎన్టీఆర్ హీరో.. మీరు కమెడియన్ కదా అని నిర్మాత అంటే.. ఐతే హీరోనే కమెడియన్‌గా చూపించి సినిమాను విడుదల చేయండి అని రాజబాబు సమాధానం చెప్పారట... ఈ విషయాన్ని రాజబాబు తమ్ముడు చిట్టిబాబు ఓ సందర్భంలో చెప్పారు. జగపతి పిక్చర్స్ బ్యానర్‌పై అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి, కృష్ణకుమారి, గుమ్మడి వెంకటేశ్వరరావు కలయికలో 1965లో వచ్చిన ‘అంతస్తులు’ సినిమాలో నటించిన రాజబాబు రూ.1,300 పారితోషికం అందుకున్నాడు. అదే రాజబాబు తొలిసారిగా తీసుకున్న పెద్ద మొత్తం. ఆ తరువాత అగ్ర హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. రాజబాబు కెరీర్ పీక్స్‌లో ఉన్న టైమ్‌లో రోజులు లెక్క కాకుండా గంటల లెక్కన రెమ్యునరేషన్ తీసుకునేవాడు. ఒక గంట ఎన్టీఆర్‌తో నటిస్తే, మరో గంట ఏఎన్నార్, కృష్ణ, శోభన్‌బాబు సినిమాల్లో నటించిన రికార్డు ఆయనది. డబ్బుకు, పరపతికి కొదవ లేదు. కుటుంబంతో గడపలేంత బిజీగా, తన గురించి తాను ఆలోచించుకోలేంత బిజీగా మారిపోయాడు. ఒకప్పుడు మద్రాస్‌లో పంపు నీళ్లు తాగి కాలం వెళ్లదీసిన రాజబాబు హాస్యనటుడిగా హీరోను మించిన పాపులారిటీ, డబ్బు సంపాదించాడు. బహుశా వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నవారే హాస్యనటులుగా రాణిస్తారేమో అనిపిస్తుంటుంది. చార్లీ చాప్లిన్ మొదలుకొని రాజబాబు వరకు ఎంతో మంది హాస్యనటులు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నవారే. జీవితం తొలినాళ్లలోనే ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు ఉన్నత స్థితికి చేరుకున్న తర్వాత కూడా కష్టాలు ఆయన్ని వీడలేదు. కష్టాలు తమ రూపాన్ని మార్చుకుని మరీ రాజబాబును వెంబడించాయి. తన ప్రతి పుట్టినరోజు నాడు రాజబాబు ఒక తారను సత్కరించేవారు. ఈ సంప్రదాయం బాలకృష్ణ(పాతాళభైరవిలో అంజిగాడు)తో ప్రారంభించారు. సావిత్రిని సత్కరించినప్పుడు ఆమె పరిస్థితి చూసి వేదికపైనే బోరున ఏడ్చేశారట. జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు ఆయన జీవితం సమస్యలమయమే అయినప్పటికీ తాను మాత్రం కోట్లమంది ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. రాజమండ్రిలో పారిశుద్ధ్య పనులు చేసేవారి దుస్థితి చూసిన చలించిపోయిన ఆయన వారికోసం ఏకంగా ఓ కాలనీ కట్టించారు. రాజమండ్రిలోనే ఓ జూనియర్ కాలేజీని కూడా కట్టించారు. 1937 అక్టోబర్ 20న పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో ఉమా మహేశ్వరరావు, రమణమ్మ దంపతులకు జన్మించిన రాజబాబు అసలు పేరు పుణ్యమూర్తుల అప్పల రాజు. ఇంటి పేరును సార్థకం చేసే విధంగా ఆయన దాన ధర్మాలు చేశారు. తాను ఆకలితో ఇబ్బంది పడినప్పుడు పట్టెడన్నం పెట్టి ఆదుకున్న అందరినీ గుర్తుంచుకొని మరీ వారికి సాయం చేశారు. 20 ఏళ్ల కాలంలో 589 సినిమాల్లో నటించిన రాజబాబు... వరుసగా 13 సార్లు ఫిల్మ్‌ఫేర్ అవార్డు పొంది రికార్డు సాధించారు సినిమాలో రాజబాబు ఉన్నాడా? లేడా? అని చూసి డిస్ట్రిబ్యూటర్లు సినిమా కొనే పరిస్థితి అప్పట్లో ఉండేది. రాజబాబు కనిపిస్తేనే ఆ సినిమాకు కాసులు రాలుతాయని నిర్మాతలు నమ్మేవారు. తాతా మనవడు, పిచ్చోడి పెళ్లి, తిరుపతి, మనిషి రోడ్డున పడ్డాడు, ఎవరికి వారే యమునా తీరే, తాతా మనవడు సినిమాల్లో హీరోగానూ నటించి మెప్పించారు. పనీ పనీ పనీ రాజబాబుకు తెలిసింది అదొక్కటే. సినిమాల్లో పడి కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో భార్య అలిగి పిల్లలను తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది, ఆ ప్రభావం రాజబాబుపై బాగా పడిందని ఆయనతో దాదాపు 250 సినిమాల్లో జంటగా నటించిన రమాప్రభ ఓ సందర్భంలో తెలిపారు. సున్నిత మనస్కుడైన రాజబాబుపై కుటుంబ కలహాలు తీవ్రమైన ప్రభావం చూపించాయి. దీంతో మద్యానికి బానిస కావడంతో సినిమా అవకాశాలు తగ్గాయి. మరోవైపు సంపాదించినదంతా దానధర్మాలకే ఖర్చయిపోవడంతో ఆఖరి సమయంలో ఆయన ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డారు. చివరికి 1983, ఫిబ్రవరి 14న హైదరాబాద్‌లోని ఓ అస్పత్రిలో తుది శ్వాస విడిచారు. అప్పటికి ఆయన వయసు 45ఏళ్లు మాత్రమే. అంతకు ముందు రోజే నీతో మాట్లాడాలని ఉంది వస్తావా? అని రమాప్రభకు ఫోన్ చేశారట రాజబాబు. అయితే చివరకు ఆ చిన్న కోరిక కూడా తీరకుండానే ఆయన కన్నుమూశారు. రాజబాబు పండించిన హాస్యం, చేసిన సేవలకు గుర్తుగా రాజమండ్రిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఏటా రాజబాబు కుటుంబం ఏటా ఇక్కడకు వచ్చి ఆయన జయంతి, వర్థంతి నిర్వహిస్తుంటుంది. రాజబాబుకు ఇద్దరు కుమారులు నాగేంద్ర బాబు, మహేశ్‌బాబు. ప్రస్తుతం వారిద్దరు అమెరికాలో సొంత ఐటీ కంపెనీని నిర్వహిస్తున్నారు. చిన్నతనంలో ఎన్నో కష్టాలు అనుభవించిన రాజబాబు తాను బాగా సంపాదించి కారు కొని తల్లికి చూపించాలనుకున్నారట. అయితే రాజబాబుకు ఆ అవకాశం ఇవ్వకుండానే ఆమె కన్నుమూశారు. అలాగే రాజబాబు కుమారులు సొంతంగా ఎదిగి అమెరికాలో ప్రయోజకులైతే వారిని చూడకుండానే రాజబాబు తనువు చాలించడం విషాదకరం.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l2QSsV

No comments:

Post a Comment

'India In 1947 Was A Ticking Time Bomb'

'When you watch Freedom At Midnight, I want you to feel like you are sitting on a ticking time bomb.' from rediff Top Interviews h...