Tuesday 9 July 2019

ఆ సినిమా తరవాత నన్ను నేను తెరపై చూసుకోలేదు: సందీప్ కిషన్

ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె.నాయుడు మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నటుడు సందీప్ కిషన్. తొలి సినిమా ‘ప్రస్థానం’తోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సోలో హీరోగా ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. అయితే ఆ తరవాత ఆయనకు చెప్పుకోదగిన హిట్లేమీ పడలేదు. దీంతో ఆయనే నిర్మాతగా మారి ‘నిను వీడని నీడను నేనే’ అనే సినిమాను నిర్మించారు. సందీప్ కిషన్, అన్యా సింగ్ జంటగా నటించిన ఈ చిత్రానికి కార్తీక్ రాజు దర్శకత్వం వహించారు. ఈనెల 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. చిత్ర ప్రచారంలో భాగంగా కాసేపు మీడియాతో ముచ్చటించారు. ఆ ముచ్చట్లు మీకోసం.. ✦ నిను వీడని నీడను నేనే.. ఇంతకీ ఆ నీడ ఎవరు? ‘వెన్నెల’ కిషోర్! అతడు నన్ను ఎందుకు వీడటం లేదనేది కథ. కొత్తగా ఉంటుంది. ఇప్పటికే సినిమా చూశా. మంచి సినిమా చేశాననే ఫీలింగ్ కలిగింది. కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. నాకు అయితే సినిమా చాలా చాలా నచ్చింది. నేను కాదు, హీరోయిన్‌కి డ‌బ్బింగ్ చెప్పిన తరవాత చిన్మయి.. ‘అరే, మంచి సినిమా తీశావ్’ అని చెప్పింది. రీరికార్డింగ్‌ కోసం త‌మ‌న్‌కి సినిమా పంపిస్తే, ఫోన్ చేసి ‘డార్లింగ్.. సినిమా సూపర్‌గా ఉంది, హిట్’ అన్నాడు. ‘నిజంగా బావుందా?’ అని అడిగా.. ‘డౌట్స్ ఏం పెట్టుకోకు. హిట్’ అన్నాడు. శుక్రవారం థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా బావుందని అంటారు. నాకు మంచి పేరు తీసుకొచ్చే చిత్రమిది. ✦ సినిమా కథేంటి? ట్రైలర్‌లో సినిమా కథంతా చెప్పేశాం. స్క్రీన్‌ప్లే కూడా! ఒక అబ్బాయి ప్రేమలో పడతాడు. ఒక రోజు ల‌వ‌ర్‌తో క‌లిసి కారులో వెళ్తుండ‌గా యాక్సిడెంట్ అవుతుంది. తర్వాత నుంచి అద్దంలో చూసుకుంటే తన బదులు మరొకరు కనిపిస్తారు. ఎందుకలా కనిపిస్తున్నారు? అనేది కథ. న్యూ ఏజ్ సినిమాను కొంచెం కమర్షియల్ పంథాలో చెప్పడానికి ప్రయత్నించాం. ✦ మరి, గ్రీస్‌లో కుర్రాడి క‌థేంటి? నేను చెప్పను. మీరు సినిమాలో చూడండి. ఆ కుర్రాడి ఆత్మ ‘వెన్నెల’ కిషోర్ కావచ్చు. పూర్వ జన్మలో నేనే ‘వెన్నెల’ కిషోర్ కావచ్చు. ఆ కథను మేం రిఫరెన్స్‌గా తీసుకున్నామా? అనేది తెరపై చూడాలి. హారర్ ఫాంటసీ ఫిల్మ్. ఎమోషన్ కూడా ఉంటుంది. ✦ ప్రేమకథలు, కామెడీ థ్రిల్లర్స్ చేశారు. ఇప్పుడు హారర్ టచ్ చేశారు. ఎలా అనిపిస్తోంది? నాకు హారర్ సినిమాలు ఇష్టం. చూస్తూ ఎంజాయ్ చేస్తాను. యాక్టర్‌గా ప‌ర్‌ఫార్మెన్స్‌కి స్కోప్ ఉండదనే ఫీలింగ్‌తో హార‌ర్ జాన‌ర్ ట‌చ్ చేయ‌లేదు. హారర్ జానర్ ట్రెండ్ నడిచినప్పుడు కూడా నేను అటువైపు వెళ్ళలేదు. కానీ, ఈ కథ విన్నప్పుడు హారర్‌ను మించి ఒక విషయం ఉంది. అది నన్ను బాగా ఆకర్షించింది. థియేటర్ల నుంచి బయటకు వచ్చే ప్రేక్షకులు కూడా ఇదొక హారర్ సినిమా అని చెప్పరు. వేరే అనుభూతితో వస్తారు. అందుకనే, ఇన్నాళ్లు యాక్ట్ చేసిన నేను ఈ సినిమాతో నిర్మాతగా మారాను. ✦ హారర్ కామెడీలు, హారర్ థ్రిల్లర్స్ వచ్చాయి. ‘నిను వీడని నీడను నేను’ ఎలాంటి సినిమా? హారర్ యూనివర్సల్ జానర్. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’లా తీసినా హిట్ అవుతుంది. ‘గృహం’లా తీసినా, ‘ప్రేమకథా చిత్రమ్’లా తీసినా హిట్ అవుతుంది. మా సినిమాలో కామెడీ ఉంటుంది. కానీ, కావాలని ఎక్కడా కామెడీని ఇరికించలేదు. సినిమాలో నాకు అద్దంలో కనిపించేది ‘వెన్నెల’ కిషోర్. అంతకంటే ఏం చెప్పను? కథలో భాగంగా కామెడీ వస్తుంది. పోసాని కృష్ణమురళి గారు ఇరగదీశారు. హారర్, కామెడీ కంటే ఎమోషన్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ✦ హారర్ సినిమాలు చేయకూడదనుకున్న మిమ్మల్ని దర్శకుడు ఎలా ఒప్పించారు? కథ చెప్పడానికి వచ్చే ముందు హారర్ సినిమా అని చెప్పలేదు. ‘కొత్త కథ ఒకటుంది. వినండి’ అంటే కలిశా. కథ చెప్పడం స్టార్ట్ చేశారు. పది నిమిషాలకు హారర్ కథ చెప్తున్నారేంటి? అనుకున్నాను. ముందుకు వెళ్లగా వెళ్లగా కథ స్వరూపమే మారింది. ఇదొక జానర్ షిఫ్టింగ్ ఫిలిం. కథ 2043లో మొదలవుతుంది. మళ్ళీ వర్తమానానికి వస్తుంది. ప్రజెంట్ నుంచి మళ్లీ ఫ్యూచర్‌కి వెళ్తుంది. హారర్ జానర్ దాటి ఎమోషనల్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఒక ఐదు నిమిషాల పాటు 25 ఏళ్ల తరవాత ప్రపంచం ఎలా ఉంటుందనేది చూపించాం. ✦ నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకోవడానికి కారణం ఏంటి? అందరికీ తెలిసిందే..! గత రెండేళ్లలో నా సినిమాలు ఏవీ ఆడలేదు. లాస్ట్ మూడు సినిమాలు సరిగా లేవు. వాటిని నేనే థియేటర్లలో చూడలేదు. ‘నక్షత్రం’ తర్వాత నన్ను నేను వెండితెరపై చూసుకోలేదు. ఈ శుక్రవారం సంతోషంగా చూసుకుంటా. ఇంతకు ముందు సినిమాల్లో తప్పు ఎక్కడ జరిగిందో విడుదలకు ముందు తెలిసేది. విడుదల తర్వాత ప్రేక్షకులు కూడా ఆ తప్పులే చెప్పారు. ఒకవేళ ఆ తప్పులు జరగకుండా కాపాడుకోగలిగితే? అనే ఆలోచన వచ్చింది. అందుకే.. నిర్మాతగా మారాను. గత సినిమాల్లో తప్పులకు నేను ఎవరినీ తప్పుబట్టడం లేదు. నేనూ కథలు విని ఒప్పుకున్నవాడినే కదా. ఈ సినిమా వరకూ నేను నమ్మిన విధంగా తీయాలనుకుని తీశా. టీజర్ కంటే ట్రైలర్, ట్రైలర్ కంటే సినిమా బావుండాలనే కష్టపడ్డాను. భయంకరంగా కథకు ఏం కావాలో అది ఖర్చుపెట్టాను. థియేటర్ నుంచి ప్రేక్షకుడు బయటకు వచ్చేటప్పుడు బావుందనే ఫీలింగ్‌తో రావాలనే సింగిల్ పాయింట్ అజెండాతో చేశా. ✦ ఈ సినిమాకు నిర్మాతగా కష్టపడ్డారా? నటుడిగా కష్టపడ్డారా? సుమారు పాతిక సినిమాలు చేశాను కాబట్టి నటించడం అలవాటే. ప్రతి సినిమాకు నటుడిగా రెండొందల శాతం కష్టపడతా. ‘నక్షత్రం’ షూటింగులో గాయం కావడం వలన నెత్తిపై 12 కుట్లు పడ్డాయి. మొన్న ‘తెనాలి రామకృష్ణ’ షూటింగులో కంటికింద గాయమైంది. కాబట్టి.. నటించడం కష్టం కాదు. ఈ సినిమాకు నేను ఆ ప్రెజర్ తీసుకోలేదు. ప్రొడక్షన్ ప్రెజర్ తీసుకున్నాను. అనుకున్నది అనుకున్నట్టుగా తీయాలని, చెప్పిన తేదీకి విడుదల చేయాలనీ ప్రెజర్ తీసుకున్నాను. మంచి మంచి టెక్నీషియన్లను తీసుకున్నాను. స్టెప్ బై స్టెప్ దాటుకుంటూ వచ్చాను. ఇప్పుడు 12న థియేటర్లలోకి వస్తున్నాను. ఈ ప్రయాణంలో నా ఫ్రెండ్, సినిమా నిర్మాతల్లో ఒకరైన దయా పన్నెం అందించిన సహకారం మరువలేనిది. అలాగే, ‘జెమిని’ కిరణ్ గారు, అనిల్ సుంకర గారు చాలా హెల్ప్ చేశారు. ✦ నిర్మాతగా బాగా సంతోషపడిన సందర్భం? ఇటీవల హిందీలో పేరున్న దర్శక నిర్మాతలు సినిమా చూసి రీమేక్ రైట్స్ కొనుక్కున్నారు. వాళ్లు ఎవరనేది త్వరలో ప్రకటిస్తా. నేను కంటెంట్ నమ్మి సినిమా చేశాను. వాళ్లకు అదే కంటెంట్ నచ్చి రీమేక్ రైట్స్ కొన్నారు. ✦ మీ తదుపరి చిత్రాలు ఏంటి? జి.నాగేశ్వరరెడ్డి గారి దర్శకత్వంలో నటిస్తున్న ‘తెనాలి రామకృష్ణ’ షూటింగ్ మరో 20 రోజుల్లో అయిపోతుంది. రెండు మూడు నెలల్లో విడుదల చేస్తాం. ‘నిను వీడని నీడను నేనే’తో పోలిస్తే కంప్లీట్ డిఫరెంట్ సినిమా ఇది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అమెజాన్ కోసం మనోజ్ బాజ్‌పాయ్‌గారితో క‌లిసి రాజ్-డీకే దర్శకత్వంలో ‘ది ఫ్యామిలీ మాన్’ అనే హిందీ వెబ్ సిరీస్‌లో న‌టించాను. షూటింగ్ పూర్తయింది. యాక్షన్ ప్యాక్డ్ రోల్ చేశా. మరో తెలుగు సినిమా చర్చల దశలో ఉంది. త్వరలో వివరాలు వెల్లడిస్తా.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XAsQ0A

No comments:

Post a Comment

'Kamala-Trump Race Is Very Close'

'If Trump wins the election, there's not going to be much turmoil.' from rediff Top Interviews https://ift.tt/VNgPS9i