హీరోగా సినిమా వచ్చి ఏడాది దాటిపోయింది. కిందటేడాది ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నిఖిల్.. దాని తరవాత ‘ముద్ర’ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇదే పేరుతో మరో సినిమా రావడంతో వివాదమైంది. మొత్తం మీద టైటిల్‌ను మార్చి ‘అర్జున్ సురవరం’గా విడుదల చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని కార్మిక దినోత్సవం సందర్భంగా మే 1న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, ఆ తేదీకి సినిమా విడుదల కాలేదు. అదే టైమ్‌లో ‘అవెంజర్స్’ విడుదలవుతుండటంతో వెనక్కి తగ్గారు. అప్పటి నుంచి మూడు నెలలు గడిచిపోయాయి కానీ విడుదల తేదీని మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు. ఏదో ఒక కారణం చూపుతూ వాయిదా వేస్తూ వస్తున్నారు. మే 9న సూపర్ స్టార్ మహేష్ బాబు ‘మహర్షి’ విడుదల కావడంతో ఆ సమయంలో ‘అర్జున్ సురవరం’ను విడుదల చేసే ధైర్యం చేయలేదు. ఇప్పుడు ‘సాహో’కు భయపడుతున్నారు. ఆ సినిమా విడుదలైన తరవాతే ‘అర్జున్ సురవరం’ను విడుదల చేస్తారట. ఈ విషయాన్ని స్వయంగా హీరో నిఖిల్ సిద్ధార్థ వెల్లడించారు. ‘అర్జున్ సురవరం’ కోసం వేచిచూస్తోన్న ఓ అభిమాని ట్విట్టర్ ద్వారా నిఖిల్‌ను ప్రశ్నించారు. ‘16 నెలలు అవుతుంది అన్న నీ మూవీ కిర్రాక్ పార్టీ రిలీజ్ అయ్యి.. అర్జున్ సురవరం కోసం వెయిటింగ్’ అని నిఖిల్‌ని ట్యాగ్ చేసి ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు నిఖిల్ స్పందించారు. ‘నిరీక్షణకు ప్రతిఫలం దక్కుతుంది. పెద్దన్న ‘సాహో’ తరవాత ‘అర్జున్ సురవరం’ విడుదల ఉంటుంది’ అని ట్వీట్‌లో నిఖిల్ పేర్కొన్నారు. ఇలా ఎప్పటి వరకు వాయిదా వేసుకుంటూ వెళ్తారో అర్థం కావడంలేదు. వాస్తవానికి ఈ సినిమాపై నిఖిల్‌కు చాలా నమ్మకం ఉంది. స్టూడెంట్స్ కోసం పోరాడే జర్నలిస్ట్ అర్జున్ సురవరం కథ ఇది. సినిమాపై నిఖిల్‌కు ఉన్న నమ్మకం డిస్ట్రిబ్యూటర్లకు లేనట్టుంది. ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ల సలహా మేరకే సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు తొలిసారి నిఖిల్ ప్రకటించారు. ఇక అప్పటి నుంచి సినిమా వాయిదా పడుతూనే వస్తోంది. విడుదలయ్యే ప్రతి సినిమాకు భయపడితే ఇంకెప్పుడు విడుదల చేస్తారు ఈ ‘అర్జున్ సురవరం’ను అనే మాట ప్రేక్షకుల నుంచి రాకముందే ఈ చిత్రాన్ని విడుదల చేస్తే మంచిది. కాగా, ‘సాహో’ ఆగస్టు 30న విడుదలవుతోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2MlXc08
No comments:
Post a Comment