ప్రముఖ కొరియోగ్రాఫర్, హీరో, దర్శకుడు రాఘవ లారెన్స్ ఇతరులకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. కరోనా వైరస్ కారణంగా ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతోన్న సినీ కార్మికులు, పేదలు, సినీ నృత్యకళాకారులను ఆదుకోవడానికి ఇప్పటికే రూ.3 కోట్ల విరాళం ప్రకటించారు. ఈ రూ.3 కోట్లలో పీఎం కేర్స్ ఫండ్, తమిళనాడు సీఎం రిలీఫ్ ఫండ్, ఎఫ్ఈఎఫ్ఎస్‌ఐ యూనియన్, డాన్సర్స్ యూనిన్లకు రూ.50 లక్షల చొప్పున.. దివ్యాంగులకు రూ.25 లక్షలు, తన స్వస్థలం చెన్నైలోని రోయపురంలోని పేద ప్రజల కోసం రూ.75 లక్షల సాయం అందజేస్తున్నట్టు లారెన్స్ స్పష్టం చేశారు. లారెన్స్ ప్రకటించిన మొత్తాన్ని ప్రస్తుతం డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. పేద, దివ్యాంగ నృత్య కళాకారులకు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఒక్కొక్కరికీ రూ. 25,000 చొప్పున హైదరాబాద్‌లో 10 మందికి, చెన్నైలో 13 మందికి మొత్తం 23 మందికి 5 లక్షల 75 వేల రూపాయలు లారెన్స్ డైరెక్ట్‌గా వారి అకౌంట్లో వేశారు. దివ్యాంగులైన డ్యాన్సర్లను లారెన్స్ మొదటి నుంచీ ప్రోత్సహిస్తోన్న సంగతి తెలిసిందే. తన సినిమాల్లోని ఒక పాటలో కచ్చితంగా దివ్యాంగ డ్యాన్సర్లను చూపిస్తూ ఉంటారు. తన ఛారిటీ నుంచి వాళ్లకు సాయం అందిస్తూ ఉంటారు. ఇప్పుడు, ఈ కరోనా కష్టకాలంలో తనను నమ్ముకున్నవారు ఎలాంటి ఇబ్బంది పడకూడదని ఈ ఆర్థిక సాయం అందిస్తున్నారు. Also Read: ఇదిలా ఉంటే, తన అభిమాన నటుడు సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లారెన్స్ నటించబోతున్నారు. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ మూవీ ‘చంద్రముఖి’కి సీక్వెల్‌గా వస్తోన్న ‘చంద్రముఖి 2’లో తాను నటిస్తున్నట్టు లారెన్స్ ఆ మధ్య ప్రకటించారు. ఈ సినిమాకు కూడా పి.వాసు దర్శకత్వం వహిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం అడ్వాన్స్‌గా తీసుకున్న డబ్బునే లారెన్స్ విరాళంగా ప్రకటించారు. సేవను తాను దైవంగా భావిస్తానని.. ఇతరులకు సేవ చేయడంలోనే దైవత్వాన్ని వెతుక్కుంటానని లారెన్స్ చాలా సార్లు చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2W4KMgq
No comments:
Post a Comment