అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు కుమార్తె ఇవాంక ట్రంప్ కూడా భారత్‌లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆమె తాజ్‌మహల్ ముందు కూర్చొని ఫొటో దిగారు. ఆ ఫొటోను చాలా మంది మార్ఫింగ్ చేశారు. మార్ఫింగ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో బాగా వైరల్ అయ్యాయి. ముఖ్యంగా ఇవాంకను ఓ యువకుడు సైకిల్‌పై కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నట్టు ఉన్న ఫొటో అందరినీ ఆకట్టుకుంది. ఇవాంక ఫొటోను సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా సరదాగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పెడుతున్నారు. బాలీవుడ్ హీరో, ‘ఉడ్తా పంజాబ్’ ఫేమ్ దిల్జిత్ దొసాంజ్ ఇవాంకతో దిగినట్లుగా ఫొటో మార్ఫింగ్ చేశారు. ఈ ఫొటోను ట్వీట్ చేశారు. అయితే, ఈ ట్వీట్‌కు జర్నలిస్ట్ ఆదిత్య చౌదరి స్పందించారు. చాలా ఆలస్యమైంది పాజీ అంటూ ఇప్పటికే వైరల్ అయిన ఇవాంక మార్ఫింగ్ ఫొటోలతో ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ఈ ట్వీట్‌లకు ఇవాంక స్పందించారు. అది కూడా చాలా పాజిటివ్‌గా. ‘అద్భుతమైన తాజ్‌మహల్ వద్దకు నన్ను తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు. నేనెప్పటికీ మరిచిపోలేని అనుభవాన్ని నాకు ఇచ్చారు’ అని దిల్జిత్ దొసాంజ్ ట్వీట్‌కు ఇవాంక రిప్లై ఇచ్చారు. అలాగే, జర్నలిస్ట్ ఆదిత్య చౌదరి ఇచ్చిన రిప్లైపై కూడా ఇవాంక స్పందించారు. ‘భారతీయుల ఆత్మీయతను నేను మెచ్చుకుంటున్నాను. నాకు చాలా మంది కొత్త స్నేహితులు వచ్చారు’ అని ఆమె రీట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే, ఇవాంక స్పందించిన తీరుకు సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ ముగ్ధులైపోయారు. ఆమె సెన్సాఫ్ హ్యూమర్‌ను మెచ్చుకున్నారు. ఈ మేరకు ఇవాంక ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. ‘‘ఈ ట్వీట్ మీ గొప్పతనాన్ని, సూపర్ సెన్సాఫ్ హ్యూమర్‌ను తెలియజేస్తుంది. నా మాతృభూమి తరఫున మీకు దక్కిన గౌరవం, ప్రేమ ఇవి. ధన్యవాదాలు’’ అని సాయి తేజ్ ట్వీట్ చేశారు. మొత్తం మీద ఇవాంక ట్రంప్ భారతీయుల మనసులు గెలుచుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2I7rHTU
No comments:
Post a Comment