తమ అభిమాన హీరో గృహ నిర్బంధం(హోం క్వారంటైన్)లో ఉన్నానే వార్త బయటికి రావడంతో లోకనాయకుడు కమల్ హాసన్ ఫ్యాన్స్ శనివారం ఉదయం తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే, అలాంటిదేమీ లేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. చెన్నైలోని ఆల్వార్‌పేట్‌లో ఉన్న కమల్ హాసన్ ఇంటికి చెన్నై కార్పోరేషన్ ‘హోం క్వారంటైన్’ స్టిక్కర్‌ను అతికించింది. కొంత సేపటి తరవాత ఆ స్టిక్కర్‌ను తొలగించారు. ఈ లోపలే ఆ సమాచారం అభిమానుల దగ్గరికి వెళ్లిపోయింది. దీంతో తమ హీరోకు ఏమైందనే భయంతో ఎంక్వైరీలు మొదలుపెట్టారు. విషయం కమల్ దగ్గరకు వెళ్లడంతో ఆయన స్పందించారు. అభిమానులనుద్దేశించి ఒక ప్రకటనను విడుదల చేశారు. ‘‘నా ఇంటి బయట గోడకు నోటీస్ అంటించడం వల్ల నేను క్వారంటైన్‌లో ఉన్నానని ఒక వార్త వ్యాపించింది. కానీ, నేను కొన్నేళ్లుగా ఆ ఇంట్లో ఉండటం లేదని మీలో చాలా మందికి తెలుసు. ప్రస్తుతం ఆ ఇంటిని మక్కల్ నీది మయ్యం పార్టీ ఆఫీసుగా వినియోగిస్తున్నాం. కాబట్టి, నేను క్వారంటైన్‌లో ఉన్నాను అని వచ్చిన వార్తలు అవాస్తవం’’ అని తన ప్రకటనలో కమల్ హాసన్ స్పష్టం చేశారు. కరోనా వైరస్ నుంచి రక్షణ పొందడంలో భాగాంగా తాను సామాజిక దూరాన్ని పాటిస్తున్నానని కమల్ పేర్కొన్నారు. ప్రజలు కూడా సామాజిక దూరం పాటించాలని విజ్ఞప్తి చేశారు. Also Read: ఇదిలా ఉంటే, కరోనా వైరస్ సోకిన వారికి వైద్యం అందించడానికి తన ఇంటిని తాత్కాలిక హాస్పిటల్‌గా మార్చడానికి తాను సిద్ధమని కమల్ హాసన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, అది ఏ ఇల్లు అనే విషయంలో కమల్ క్లారిటీ ఇవ్వలేదు. బహుశా అది ఆల్వార్‌పేట్ ఇల్లే కావచ్చు. తమ కుటుంబం మొత్తం సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉందని ఇప్పటికే కమల్ హాసన్ కుమార్తె, హీరోయిన్ శృతిహాసన్ ప్రకటించారు. ఇటీవల లండన్ నుంచి వచ్చిన శృతిహాసన్.. తాను, తన తల్లి సారిక ముంబైలో వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నామని చెప్పారు. అలాగే, తన తండ్రి కమల్ హాసన్, చెల్లెలు అక్షర చెన్నైలోని వేర్వేరు ఇళ్లలో ఒంటరిగా ఉంటున్నారని వెల్లడించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Unxyvm
No comments:
Post a Comment