ప్రముఖ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి 70వ జన్మదిన వేడుకలు సోమవారం రాత్రి ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ , నటసింహం నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేశ్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, ప్రముఖ నిర్మాతలు అల్లు అరవింద్, ఎమ్మెస్ రాజు, అశ్వనీదత్, దిల్ రాజు, అనిల్ సుంకర, దర్శకులు బి. గోపాల్, పరుచూరి వెంకటేశ్వరరావు, సత్యానంద్, డాక్టర్ కె.ఎల్. నారాయణ, చంటి అడ్డాల, ఎస్ గోపాల్‌రెడ్డి, సంగీత దర్శకుడు కోటి, కెమెరామెన్ రవీంద్రబాబు, శ్రీమిత్ర చౌదరి, శ్రీనివాస్ రాజు, కోదండరామిరెడ్డి కుమారులు సునీల్, వైభవ్, ఆయన కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కోదండరామిరెడ్డి జన్మదిన వేడుకల్లో ప్రముఖులంతా హాజరుకావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది. బాలయ్య, చిరంజీవి తదితరుల సమక్షంలో కోదండరామిరెడ్డి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా కోదండరామిరెడ్డికి చిరంజీవి, బాలకృష్ణ పుష్పగుచ్ఛాలు అందజేశారు. ఇదిలా ఉంటే.. కోదండరామిరెడ్డి పేరు వినగానే మనకు చిరంజీవి గుర్తొస్తారు. ఎందుకంటే ఆయన్ని సుప్రీమ్ హీరోగా ఇండస్ట్రీలో నిలబడేలా చేసింది కోదండరామిరెడ్డే. ‘ఖైదీ’ సినిమాతో చిరంజీవి క్రేజ్‌ను అమాంతం పెంచేశారు కోందరామిరెడ్డి. అంతేకాదు, చిరంజీవితోనే ఆయన అత్యధిక సినిమాలు తీశారు. భారత సినీ చరిత్రలో వరుసగా 16 హిట్లిచ్చిన ఏకైక దర్శకుడిగా కోదండరామిరెడ్డి నిలిచిపోయారు. నెల్లూ జిల్లాకు చెందిన కోదండరామిరెడ్డి 1980ల్లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో వి.మధుసూధనరావు వద్ద శిష్యరికం చేశారు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు వద్దా అసిస్టెంట్‌గా పని చేశారు. శ్రీధర్, చంద్రమోహన్ నటించిన ‘సంధ్య’ సినిమాతో దర్శకుడిగా కెరీర్ ప్రారంభించారు. ‘కిరాయి రౌడీ’తో చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్ కుదిరింది. ఆ తర్వాత వీరి కాంబోలో ‘న్యాయం కావాలి’, ‘అభిలాష’ చిత్రాలు వచ్చాయి. అయితే, ‘ఖైదీ’ సినిమాతో కమర్షియల్ ప్లాట్‌ఫాం ఎక్కిన కోదండరామిరెడ్డి ఇక అక్కడి నుంచి తిరుగులేని మాస్ సినిమాలు తీశారు. ‘ఖైదీ’ తరవాత వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాల వల్ల చిరంజీవి తిరుగులేని మాస్ హీరోగా తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించారు. కోదండరామిరెడ్డి అనగానే చిరంజీవి పేరు అనివార్యంగా వినిపించినా ఆయన కేవలం చిరుకే పరిమితం కాలేదు. ఇతర హీరోలతోనూ అదిరిపోయే హిట్స్ ఇచ్చారు. బాలకృష్ణతో ‘భార్గవ రాముడు’, ‘నారీ నారీ నడుమ మురారి’, ‘ధర్మక్షేత్రం’, ‘నిప్పురవ్వ’, ‘బొబ్బిలి సింహం’, ‘ముద్దుల మొగుడు’, ‘రాణా’ లాంటి సినిమాలు తెరకెక్కించారు. నాగార్జునకు ‘ప్రెసిడెంట్ గారి పెళ్లాం’, ‘అల్లరి అల్లుడు లాంటి’ రూరల్ బ్యాక్ డ్రాప్ మాస్ హిట్లు ఇచ్చారు. అలాగే వెంకటేశ్‌తో ‘సూర్య ఐపీఎస్’, ‘పోకిరి రాజా’ సినిమాలు తీశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/307la2S
No comments:
Post a Comment