Sunday, 26 April 2020

25 వసంతాల ‘ఘటోత్కచుడు’.. ఇది ఎస్వీ కృష్ణారెడ్డి మాయ

‘యమలీల’ వంటి గోల్డెన్ జూబిలీ హిట్ తర్వాత మనీషా ఫిలిమ్స్ బ్యానర్‌లో కిషోర్ రాఠీ సమర్పణలో ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కె.అచ్చిరెడ్డి నిర్మించిన మరో సూపర్ హిట్ చిత్రం ‘ఘటోత్కచుడు’. 1995లో విడుదలైన ఈ సోషియో ఫాంటసీ చిత్రం ఏప్రిల్ 27తో 25 సంవత్సరాలు పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో ఘటోత్కచుడిగా నవరస నటసార్వభౌమ కైకాల సత్యనారాయణ నటించారు. రోజా, ఆలీ, రాజశేఖర్, శ్రీకాంత్, కోటా శ్రీనివాసరావు, తనికెళ్ల భరణి, శరత్ బాబు ఇలా భారీ తారాగణమే ఉంది. అంతేకాదు, ఈ సినిమాలో నాగార్జున ఒక స్పెషల్ సాంగ్‌లో మెరిసారు. ఈ సినిమాలో ఎస్వీ కృష్ణారెడ్డి స్వరపరిచిన పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. కాగా, ఈ చిత్రం 25 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా నిర్మాత అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. ‘‘మా మనీషా బ్యానర్‌కి, కృష్ణారెడ్డి గారికి, నాకు, మా యూనిట్ అందరికీ ‘ఘటోత్కచుడు’ 25 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తోంది. ఘటోత్కచుడుగా సత్యనారాయణ గారి అద్భుత నటన ఈ చిత్రానికి ప్రాణం పోసింది. ‘యమలీల’ తర్వాత ఆలీకి హీరోగా మంచి క్రేజ్ తెచ్చిన సినిమా ఇది. అలాగే టాప్ హీరోయిన్ రోజా క్యారెక్టర్ అందరినీ అలరించింది. రోబోట్ చేసిన చిత్ర విచిత్ర విన్యాసాలు చిన్న పిల్లలను బాగా ఎంటర్‌టైన్ చేశాయి. ఘటోత్కచుడుకి చిన్నపాపకి మధ్య హార్ట్ టచింగ్ సెంటిమెంట్ అందరినీ టచ్ చేసింది. అన్నింటికీ మించి కింగ్ నాగార్జున గారి స్పెషల్ సాంగ్ సినిమా రేంజ్‌ని పెంచింది. సినిమా ప్రారంభంలో వచ్చే కురుక్షేత్రం సన్నివేశాలు ఈ సినిమాకి పెద్ద మల్టీస్టారర్ లుక్ తీసుకొచ్చాయి. కర్ణుడిగా యాంగ్రీ హీరో రాజశేఖర్, కృష్ణుడిగా చక్రపాణి, అర్జునుడిగా శ్రీకాంత్ నటించడం ప్రేక్షకులకు కన్నులపండువ అయ్యింది. కృష్ణారెడ్డి గారు ఈ సినిమా కోసం చేసిన ‘జజజ్జ రోజా’, ‘అందాల అపరంజి బొమ్మ’, ‘ప్రియమధురం’, ‘భమ్ భమ్ భమ్’, ‘భామరో నన్నే ప్యార్ కారో’, ‘డింగు డింగు’ పాటలన్నీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్‌గా నిలిచాయి. ఈ చిత్రనిర్మాణం నా జీవితంలో ఒక మరపురాని ఘట్టం. 25 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈ చిత్రాన్ని పెద్ద హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ 25 ఏళ్లుగా టీవీలో వచ్చిన ప్రతిసారీ కొన్ని వందల మంది ఫోన్లు చేసి అభినందనలు తెలుపుతూ ఉండడం చాలా థ్రిల్ కలిగించింది. ‘ఘటోత్కచుడు’ లాంటి మంచి సినిమా మా మనీషా బ్యానర్‌లో వచ్చినందుకు నాకు, కృష్ణారెడ్డి గారికి ఎంతో సంతృప్తిగా ఉంటుంది. ‘ఘటోత్కచుడు’ కోసం అహర్నిశలు కృషిచేసిన టీంకి, ఈ ఘనవిజయానికి తోడ్పడిన ప్రేక్షకులకు, డిస్ట్రిబ్యూటర్స్‌కు, ఎగ్జిబిటర్స్‌కి, అందరికీ మించి మీడియా ఫ్రెండ్స్‌కి స్పెషల్ థాంక్స్’’ అని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/355R8jD

No comments:

Post a Comment

'Most Dargahs And Mosques Will Be Threatened'

'The new Waqf bill sows the seed for conflict in every town and village of India.' from rediff Top Interviews https://ift.tt/UcHi9...