రాళ్లే మాట్లాడతాయి.. అనంత జీవన సాగరమథనాన రాళ్లే ఒడ్డునుండి కెరటాల ధాటిని తట్టుకుంటాయి. బాధలోనూ/దుఃఖంలోనూ ఆ రాళ్లే కాస్త ఓదార్పు నిస్తాయి. జీవితేచ్ఛకు ఆలంబనగా నిలిచిన ప్రతి సందర్భాన ఆ కొణెదల వారింటి పెద్దోడు ఏనాడూ ఓడిపోలేదు. అదిరి బెదిరి సమస్యలకు సలామ్ కొట్టి పారిపోలేదు. జీవితం ఇది, జీవించాలంతే అన్న ఒక వాదనకు ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచి, తనని తాను నిరూపించుకున్నాడు. కన్నీళ్లు పెట్టుకుని మద్రాసు నగరిలో నడయాడిన వాడు, కంట తడి తుడిచి ఎందరెందరి ఇళ్లకో తానే పెద్ద కొడుకు అయ్యాడు. తెరవేల్పు అయ్యాడు. ఆ జగదేగవీరునికి జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ అందిస్తున్న ప్రత్యేక కథనం. షూటింగ్ షూటింగ్ షూటింగ్.. రంగులు మాట్లాడుతున్నంతగా తానేం మాట్లాడలేకపోతున్నాడు. కొంత కాలం అయ్యాక రంగుల కలలు రంగుతేలే వాస్తవాలు. అన్నీ అన్నీ కదలాడాయి.. ఆ ఇంటికి కలలు చుట్టరికం చేశాయి. గెలుపు ఆత్మీయ ఆతిథ్యం అందుకున్న వేళ ఆ కలలన్నీ నిజాలయ్యాయి. నిజంగానే నిజంగానే ఆ పొంత నిండిందా.. నిజంగానే నిజంగానే ఆ నిండు కుండ ఏనాడయినా తొణికిందా అనేంతగా ఇతరులు అంటే శత్రువులు సైతం ఈర్ష్యాసూయలకు లోనయ్యేలా ఎదిగాడు. ఎదిగి ఒదిగాడు. ‘చిరు త్యాగరాజు నీ పదములు పలికిన మది’ అంటూ కలకత్తా నగరి వీధుల్లో నడయాడాడు. ‘నీతోనే ఆగేనా బిళహరి’ అని కీర్తించాడు. రుద్రవీణ మీటుతూ.. ఆ తంత్రులు ఒలికించే స్వరాలకు సామాజిక బాధ్యత అందించాడు. అవును! ఏ కళకు అయినా ఏ కథకు అయినా జీవిత రంగం వేదిక కాదా! అని మరోమారు నిరూపించాడు. అవును! అతడు నడిచే నక్షత్రం.. అవును! అతడు రాగాల పల్లకిలో కోయిలమ్మ.. మన కాలం చార్లీ చాప్లీన్. బాలచందర్, విశ్వనాథ్, జంధ్యాల లాంటి వారంతా తీర్చిదిద్దిన బొమ్మ. రాఘవేంద్ర రావు, కోదండ రామిరెడ్డి వంటి వారు మలిచిన కమర్షియల్ బొమ్మ. ఇండస్ట్రీ మెచ్చిన బిగ్‌బాస్. ఇదంతా ఒక్క రోజులోనే వచ్చిందా.. ఆశ్చర్యం..!! Also Read: ‘స్టార్ స్టార్ మెగాస్టార్’ ఇలా అరచి ఎంత కాలం అయ్యింది. ‘సుప్రీం హీరో’ అని రాజ్ కోటి స్వరపరిచిన పాట పాడుకుని ఎంత కాలం అయ్యింది. ఇవన్నీ అభిమానుల మదిలో చక్కర్లు కొడుతుండగానే ఏడాది గడిచిపోయింది. గూగుల్‌లో అతడి స్థానం నంబర్‌గా నిలిచిపోయింది. దటీజ్ చిరు.. అనండిక జై చిరంజీవ అని..! ఏటా ఓ వసంతం.. ఏటేటా ఓ జన్మదినం.. పండుగ రోజు అభిమానులకు కన్నుల వాకిట రంగుల లోకం తీర్చిదిద్దిన తారకు ఆ నేల సాహో అంది. ఆ కష్టానికి ఆ శ్రమవేదానికి జేజేలు పలికింది. ఒక చిన్న అభిలాష పది మందికీ ఊపిరెలా అవుతుంది..? చిరంజీవిని అడుగు చెబుతాడు. యమహా నగరిలో బతుకెలా ఉంటుంది..? మెరీనా తీరంలో బతుకెలా ఉంటుంది..? చిరంజీవిని అడుగు చెబుతాడు. ఓరినాయినోయ్.. వాడినే అడుగు ప్రాణం ఖరీదులో జాలాది పాట విలువెంతని చెబుతాడు. ఒన్ అండ్ ఓన్లీ స్టార్ మెగాస్టార్.. ఒన్ అండ్ ఓన్లీ సౌత్ ఇండియన్ స్టార్ మెగాస్టార్.. యావత్ దక్షిణ భా రతం ఇప్పటికే ఒకే గొంతుకతో ఏకతాళంతో బృందగానంతో ఒప్పుకున్న నిజం. ‘నమ్మకు నమ్మకు ఈ రేయిని’ అంటున్నాడో చోట కవి. వెన్నెల కవి ఆయనే ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని చూపిస్తానంటూ.. హాయిగానం ఒకటి వినిస్తున్నారు. అవును! ఆ తార ఈ తార కూడికల దగ్గర ఆకాశం ఎలా ఉంటుంది. వెలుగులు పంచుకునే వేళ ఆయనింట మరో బంగారం వచ్చాడు. బంగారం లాంటి మరికొన్ని కలలను నిజం చేశాడు. ఆయన ఒక చరణ్ కావొచ్చు. ఒక పవన్ కావొచ్చు..! ఇంకా తమ తమ రంగాల్లో చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని రాణించిన వారెందరో కావొచ్చు..! అవును! ఆ కెరటం దగ్గర మనం ప్రేక్షకులం. ఆ ఇంద్రధనస్సును తీసుకువచ్చిన ఆకాశం దగ్గర మనం అంటే ఈ అభిమాన గణం నేర్చుకోవాల్సిందెంతో! ఇప్పుడు అడగండి కొమ్మలు తాకిన కోయిల ఆయన గురించి ఏమని పాడుతుందో! ఒన్ ఫ్లాష్ కట్: అనగగనగా.. మహానటి నోట సినిమా ప్రివ్యూ నడుస్తుంది. చెన్నై అనుకుంటా.. చాలా ప్రశాంతంగా ఉంది. మహానటి సావిత్రికి ప్రివ్యూ చూపిస్తున్నారు. బక్క చిక్కిన దేహంతో ఓ కుర్రాడు.. అప్పటికింకా పెద్దగా పాపులర్ కాలేదు. కానీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు తన ఆటతో.. ఎవరీ కుర్రాడు అని అడిగారామె. పేరు చెప్పారు.. ఊరు చెప్పారు.. అంతా విన్నాక ఆ కళ్లున్నాయి చూడండి.. అవి చాలు ఈ కుర్రాడు ఇండస్ట్రీని ఏలేస్తాడు అనేందుకు అని అన్నారామె.. నవ్వారామె.. ఆ కుర్రాడిని దీవించారామె. కళ్లతోనే వేవేల భావాలు ఒలికించు నటి నుంచి వచ్చిన ఆ అభినందన అందుకున్న ఆ కుర్రాడు కొణిదెల శివశంకర వర ప్రసాద్.. ఆ సినిమా పేరు మన ఊరి పాండవులు. ఇలానే రాయాలి మనం.. అప్పటికింకా మెగాస్టార్‌గా అంతగా పాపులర్ కాలేదుగా.. అలానే రాయాలి మనం.. కొంత కాలం అతడు సుప్రీంహీరో.. అతడి అందమే హిందోళం.. అవును! అతడి చెంత ఏ కన్నియ నవ్వు అయినా మల్లియ విచ్చుకున్నట్లే.. అవును! అతడికి జీవితం ఏమిచ్చింది అంటే కోటానుకోట్ల అభిమానులను.. కొన్ని నెరవేరిన అభిలాషలను. వెంకట్రావు గారి పెద్దబ్బాయ్.. స‌్వయంకృషీవలుడు ఓ చిన్న కుటుంబం.. ఆ వివరం తెలియాలంటే.. ఓ సారి నెల్లూరు పోవాలి నీవు. నీకు తెల్సా వాడు చాలా చిన్నవాడు. నాన్న దెబ్బలకు బాగా ఇబ్బంది పడినవాడు. అమ్మ ప్రేమకు బాగా దగ్గరయిన వాడు. అలా అని నాన్నేమీ విలన్ కాదు. ఈ హీరోని స్టార్‌ని చేసిన రియల్ హీరో అతడు. మామూలు మనిషి అతడు. బరువు బాధ్యతల కొసల నడుమ ఇరుక్కున్నవాడు. స్వస్థలం గోదావరి తీరం కావొచ్చు.. కానీ ఉద్యోగం అక్కడ కదా! ఆ రోజుల్లో ఓ కానిస్టేబుల్ కొడుకుగా ఎవ్వరికీ తెలియని వాడు. నాన్నలానే నటనంటే ప్రేమ ఉన్నవాడు. వాడు చాలా కాలం తరువాత ‘అందరివాడు’గా ఎదిగాడు. ‘స్వయంకృషి’కి ఉన్న విలువెంతో చాటాడు. అభిమానులూ వందనాలు చెప్పాలి మీరు.. కొట్టండ్రా చప్పట్లు.. ఇది కదా! అంటే..! ఆన్ రికార్డ్: ఈ సారి ఓ చిన్న కథ.. డైరెక్టర్ సుక్కూకి మాత్రమే ఆనందాన్నిచ్చే కథ ఇది. శంకర్ దాదా సిరీస్‌లో భాగంగా ఫస్ట్ పార్ట్ తెరకెక్కుతోంది. డబ్బింగ్ చెబుతున్నాడు చిరు. ‘ఆర్య’ కథ చెప్పేందుకు వెళ్లాడు సుక్కూ. చిరంజీవి విన్నాడు.. ఉండండి వస్తాను అని చెప్పి వెళ్లాడు. వచ్చాక మీ కథ బాగుందండి గో ఎ హెడ్.. ఏం కాదు ధైర్యంగా ముందుకు వెళ్లండి అని భుజం తట్టాడు. సుక్కూ మాటల్లో చెప్పాలంటే ఆయనకు అది ఓ ఫ్రీజింగ్ పాయింట్. ఈసారి అదే గోదావరి తీరం నుంచి అదే దారి నుంచి బేబమ్మ అనే గాయని వచ్చారు. పాట విన్నాడు పొంగిపోయాడు. తన ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చి పంపాడు. వాడు ఆపద్బాంధవుడు. వాడు అభిమానధనుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతిభ ఎక్కడున్నా జై కొడతాడతడు. ఇతరుల సమయానికి వారికి ఆయా సందర్భాల్లో దక్కిన విజయాలకు ఎంతో విలువ ఇస్తాడు. భళా తమ్ముడా: అన్నని మించిపోయాడు ఒకడు ఈ సారి అన్నని మించిపోయాడు ఒకడు. నవ్వుతున్నాడు.. కన్నీరు పెడుతున్నాడు.. అవి ఆనంద భాష్పాలు అని ఆ ఇల్లాలికి తెలుసు. అమ్మ లాంటి వదిన ముందు స్టేజ్‌పై పవన్ ఇలా చెబుతున్నాడు. ఇంకా ఏవేవో చెప్పుకుంటూ పోతున్నాడు. తమ్ముడు నన్ను దాటి పోయాడు అని అన్నాడట.. ఎవరి తోనో! వాడు ఇంట్రావర్ట్.. ఎప్పుడూ ఇంట్లో మాట్లాడనే మాట్లాడడు అని చెప్పేవాడంట! అలాంటి తమ్ముడు తనని మించి పోయాడు.. ఎవ్వరితోనూ కలవడని అనుకున్న తమ్ముడు అన్నయ్య అభిమానులందరినీ కలుపుకుని పోయాడు. అది కదా ఆ తల్లికి కావాల్సింది. అభిమానులూ మళ్లీ! కొట్టండి చప్పట్లు. ఎగైన్ అండ్ ఎగైన్ ఈల పొడు - గోల పొడు. బ్యాక్ బ్యాక్ బ్యాక్: మళ్లీ మెరీనా తీరానికి పోవాలి మనం తన గురించి అవాకులు చవాకులు పేలే పాండి బజార్ వద్దన్నాడు.. తనకు ఆనందాన్నిచ్చే మెరీనా తీరాన్నే కోరుకున్నాడు. ‘‘ఇప్పటికీ మనం చేయాల్సింది ఇదే.. ఎవ్వరేం మాట్లాడినా మెరీనా తీరంలో ఉన్నామని అనుకుని ఊరుకోవడమే.. అప్పుడే హాయి’’.. ఇదీ వాడి జీవితం.. ఇదీ వాడి వికాస పాఠం. అవును ఆ కవి అన్నాడు కదా ‘‘వెన్నెల దీపం కొందరిదా అడవికి సైతం వెలుగు కదా!’’ అలానే అతడు.. ఎందరికో దారి ఇచ్చాడు.. దారి చూపాడు. ఓ సందర్భంలో రామూ (ఆర్జీవీ) మాట్లాడిన మాటలు సైతం విని నవ్వుకున్నాడు. ఇలానే చాలా మంది ఆయనెవ్వరు మాకు తెలియదే అని కూడా అన్నారులేండి. అవి కూడా విని ఊరుకున్నాడు. నవ్వుకున్నాడు. అది కదా!సంస్కారం. నిన్నమొన్నటి వేళ ‘సైరా’ విషయమై కూడా ఏవేవో వార్తలొచ్చాయి. చరణ్ కెరియర్ విషయమై ఏవేవో వార్తలొచ్చాయి. అవన్నీ విన్నాడు.. మళ్లీ నవ్వుకున్నాడు. ఇవన్నీ కాదు అతడి గురించి ఏవేవో మాట్లాడి పరువు పోగొట్టుకున్న వారెందరో కదా! ఇన్నేళ్ల కెరియర్‌లో అతడు సాధించింది ఎంతో. ఆయనే అన్నట్లు.. సాధించాల్సిందీ ఎంతో! ఈ జన్మదిన వేళ ఆయనకు అభినందనలు.. శుభాకాంక్షలు. - రత్నకిశోర్ శంభుమహంతి
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2HxQrFl
No comments:
Post a Comment