Wednesday, 28 August 2019

60 ఏళ్ల మన్మథుడు.. హ్యాపీ బర్త్‌డే కింగ్

నాగార్జున క్లాస్ హీరో!.. ఎవరన్నారా మాట?.. ‘గీతాంజలి’ చూసినోళ్లు!.. వారెవరూ ‘హలోబ్రదర్’ చూడలేదా?.. ఐతే నాగ్ మంచి కామెడీ హీరో!.. ‘మాస్’ చూడలేదా?.. సరే నాగ్ మాస్ హీరో!.. ‘అన్నమయ్య’, ‘శ్రీరామదాసు’ బాధ పడతారేమో?.. ఐతే నాగ్ క్లాసికల్ హీరో!.. అట్టాకాదు గాని ఇంకో మాట చెప్పు!.. నాగ్ ‘ఆల్ రౌండర్’..! అంతేగా, అంతేగా. కింగ్ ఒక జోనర్‌కు పరిమితం చేయలేం. ఎందుకంటే ఆయన చేయని జోనర్ లేదు. మాస్, క్లాస్, డివోషనల్, రొమాన్స్, యాక్షన్, సోషల్, ఫాంటసీ, కామెడీ, థ్రిల్లర్, పాట్రాయిటిక్.. వీటిలో నాగ్ టచ్ చేయని జోనర్ లేదు. రికార్డులు, కలెక్షన్లతో సంబంధం లేకుండా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు నాగార్జున. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుకి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాగార్జున తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ని ఏర్పరుచుకున్నారు. అక్కినేని సామ్రాజ్యాన్ని విస్తరించారు. టాలీవుడ్‌కి ఉన్న మూడు మూలస్తంభాల్లో ఒకటిగా నిలిచారు. ఇప్పటికీ 30 ఏళ్లు దాటిన మన్మథుడిలా కనిపిస్తోన్న నాగార్జున 60వ ఏట అడుగుపెట్టారు. నేడు (ఆగస్టు 29న) తన 60వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. తమ హీరో పుట్టినరోజు వేడుకలను అక్కినేని అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరపడానికి ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నారు. ట్విట్టర్‌లో #HBDKingNagarjuna హ్యాష్‌ట్యాగ్‌తో నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. అభిమానులు కింగ్‌ను ఆకాశానికి ఎత్తుతూ ట్వీట్లు చేస్తున్నారు. Also Read:

‘విక్రమ్’ సినిమాతో హీరోగా పరిచయం అయిన నాగార్జున.. ‘మజ్ను’, ‘గీతాంజలి’ సినిమాలతో లవర్ బోయ్ ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. ఆ తరవాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘శివ’ సినిమాతో నాగ్ అసలు సిసలు మాస్ హీరో‌గా మారారు. ఈ చిత్రం టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్‌ను సృష్టించింది. ఇక ఆ తరవాత నాగార్జున వెనుదిరిగి చూడలేదు. ‘హలో బ్రదర్’, ‘నిన్నే పెళ్లాడతా’, ‘అన్నమయ్య’, ‘నువ్వు వస్తావని’, ‘ఆజాద్’, ‘సంతోషం’, ‘మన్మథుడు’, ‘శివమణి’, ‘నేనున్నాను’, ‘మాస్’, ‘శ్రీరామదాసు’, ‘కింగ్’, ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయన’, ‘ఊపిరి’, ‘దేవదాస్’.. ఇలా వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు నాగార్జున. టాలీవుడ్‌లో ప్రయోగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన హీరో నాగార్జున అంటే అతిశయోక్తికాదు. నాగ్ చేసినన్ని ప్రయోగాలు ఏ హీరో చేయలేదనే చెప్పాలి. ఇప్పటి వరకు 91 సినిమాల్లో నటించిన నాగార్జున సెంచరీ దిశగా దూసుకెళ్తున్నారు. కుమారులు నాగచైతన్య, అఖిల్‌లకు గట్టిపోటీనిస్తున్నారు. ఇంకో విషయం.. తెలుగు సినీ పరిశ్రమలో నాగార్జున పరిచయం చేసిన దర్శకులే అత్యధికం. మొత్తం 39 మంది కొత్త దర్శకులను నాగార్జున పరిచయం చేశారు. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటారు నాగ్. ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షోకి హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున.. టాలీవుడ్‌లో కొత్త ట్రెండ్ సెట్ చేశారు. నాగార్జునను ఆదర్శంగా తీసుకొని ఆ తరవాత మెగాస్టార్ చిరంజీవి, యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేచురల్ స్టార్ నాని టెలివిజన్ ప్లాట్‌ఫాంపై అడుగుపెట్టారు. ప్రస్తుతం నాగ్ ‘బిగ్ బాస్’ షోను విజయవంతంగా నడిపిస్తు్న్నారు. ఎంత పెద్ద హీరో అయినా, ఎన్ని కోట్లకు అధిపతి అయినా నాగార్జున ఎప్పటికీ ఒదిగే ఉంటారు. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తారు. టాలీవుడ్ కింగ్, నిత్య మన్మథుడు అక్కినేని నాగార్జునకు పుట్టినరోజు శుభాకాంక్షలు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2UbnV1e

No comments:

Post a Comment

'Investments Of Over Rs 4 Trn To Create 100,000 Jobs'

'The size of the investments is important, but equally crucial is the number of jobs that these proposals create.' from rediff Top...