Sunday, 27 June 2021

నా కర్తవ్యం అదే.. సంపూర్ణంగా సేవ చేయాలనే లక్ష్యంతో బరిలోకి! 'మా' ఎన్నికలపై మంచు విష్ణు బహిరంగ లేఖ

గత మూడు నాలుగు రోజులుగా 'మా' ఎలక్షన్స్ అంశం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. 'మా' అధ్యక్ష బరిలో ఉన్న సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ ప్రకటించి ప్రెస్ మీట్ పెట్టగా.. తాజాగా 'మా' అధ్యక్ష బరిలోకి దిగుతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా బహిరంగ లేఖ పోస్ట్ చేశారు విష్ణు. ఈ ఏడాది జరగబోతున్న ‘మా’ అధ్యక్ష పదవికి తాను నామినేషన్‌ వేస్తున్నానని తెలుపుతూ ఆయన వివరణ ఇచ్చారు. ''మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి నేను నామినేషన్‌ వేస్తున్నానని 'మా' కుటుంబ సభ్యులైన మీ అందరికీ తెలియజేయడం గౌరవప్రదంగా భావిస్తున్నాను. సినిమా పరిశ్రమనే నమ్ముకున్న కుటుంబంలో పుట్టిన నేను తెలుగు సినిమాతోనే పెరిగాను. మన పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు, కష్టనష్టాలు.. ప్రత్యక్షంగా చూస్తూ పెరిగిన నాకు ‘మా’ కుటుంబసభ్యుల భావాలు, బాధలు బాగా తెలుసు. నాకు, నా కుటుంబానికి ఎంతో పేరు ప్రతిష్ఠలు అందించిన తెలుగు సినిమా పరిశ్రమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఆ రుణం తీర్చుకోవడానికి ఈ పరిశ్రమకు సేవ చేయడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. మా నాన్నగారు మోహన్‌బాబు ‘మా’ అసోసియేషన్‌కు అధ్యక్షుడిగా చేసిన సేవలు, వారి అనుభవాలు, నాయకత్వ లక్షణాలు ఇప్పుడు నాకు మార్గదర్శకాలు అయ్యాయి. గతంలో ‘మా’ అసోసియేషన్‌కు ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా పనిచేసినప్పుడు ‘మా’ బిల్డింగ్‌ ఫండ్‌కి నా కుటుంబం తరఫున నిర్మాణానికి అయ్యే ఖర్చులో 25 శాతం అందిస్తానని మాట ఇచ్చాను. భవన నిర్మాణం ఇంకా ప్రారంభం కాలేదు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా నేను కొన్ని సలహాలు, సూచనలు చేశాను. అవి ‘మా’ కుటుంబ సభ్యుల సహకారంతో దిగ్విజయంగా అమలు చేశాను. ‘మా’ వ్యవహారాలన్నింటినీ అతి దగ్గరగా, జాగ్రత్తగా పరిశీలించిన నాకు ‘మా’ కుటుంబ సభ్యులకు ఏది అవసరమో స్పష్టమైన అవగాహన, అనుభవం ఉంది. మన ఇంటిని మనమే చక్కదిద్దుకుందాం. కష్టాల్లో ఉన్న కళాకారులకు ఎప్పుడూ అండగా ఉంటాం. ‘మా’ అసోసియేషన్‌కి అధ్యక్షుడిగా నా సేవలు సంపూర్ణంగా అందించాలనుకుంటున్నాను. పెద్దల అనుభవాలు, యువ రక్తంతో నిండిన కొత్త ఆలోచనలు కలగలిపి నడవాలనే నా ప్రయత్నం, మీ అందరి సహకారంతో విజయవంతం కావాలని ఆశిస్తున్నా'' అని మంచు విష్ణు తన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు జీవిత రాజశేఖర్, హేమ 'మా' అధక్ష్య బరిలో ఉండటం రసవత్తరంగా మారింది. సెప్టెంబర్ నెలలో 'మా' ఎన్నికలు జరగనున్నాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/35UaBov

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...