Tuesday, 21 January 2020

రోజుకి రూ.250 ఇచ్చేవారు.. రూ.90 ఓల్డ్ మంక్‌కు పోయేది: బాబీ సింహా

‘జిగర్తాండ’ సినిమాతో తమిళనాట మార్మోగిన పేరు బాబీ సింహా. జూనియర్ ఆర్టిస్టుగా తన ప్రయాణాన్ని మొదలుపెట్టిన ఆయన జాతీయ పురస్కారం అందుకునే స్థాయికి ఎదిగారు. ‘జిగర్తాండ’లో నటనకు గాను ఆయనకి నేషనల్ అవార్డ్ దక్కింది. ఈ పాత్రను తెలుగులో ‘గద్దలకొండ గణేష్’గా మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ చేశారు. ‘పేట’ సినిమాలో రజినీకాంత్‌తో కలిసి నటించిన బాబీ సింహా.. ప్రస్తుతం కమల్ హాసన్ ‘భారతీయుడు 2’లోనూ చేస్తున్నారు. రవితేజ హీరోగా నటించిన ‘డిస్కోరాజా’లో ఈయనే విలన్. శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా బాబీ సింహా చెప్పిన ఆసక్తికర విషయాలు.. మీ మూలాలు ఎక్కడ? నేను హైదరాబాద్‌లోని మౌలాలీలో పుట్టాను. మా అమ్మనాన్నలది విజయవాడ దగ్గర బందర్. 1995లో మేం కొడైకెనాల్‌కు వెళ్లిపోయాం. నేను తమిళనాడులోనే పెరిగాను. నేను నాలుగో తరగతి వరకు మౌలాలీలో చదివాను. ఆ తరవాత కృష్ణా జిల్లా మోపిదేవిలో 10వ తరగతి వరకు చదివాను. ఆ తరవాత అమ్మానాన్నల దగ్గరకి వెళ్లిపోయాను. సినిమా అవకాశాల కోసం చెన్నై ఎప్పుడు వెళ్లారు? నటుడు కావాలనే కోరికతో 2005లో నేను చెన్నై వెళ్లాను. నాకు ఏ భాషా సరిగా వచ్చేది కాదు. 2008 వరకు నాకు తమిళం సరిగా రాదు. తమిళం బాగా నేర్చుకున్న తరవాత జూనియర్ ఆర్టిస్టుగా అవకాశాలు వచ్చాయి. మొదట్లో చిన్న చిన్న పాత్రలు దక్కేవి. ‘పిజ్జా’, ‘సూదు కవ్వమ్‌’, ‘నేరమ్‌’లాంటి తమిళ చిత్రాల్లో నటించాను. ‘జిగర్తాండ’తో సహాయ నటుడిగా జాతీయ అవార్డు దక్కింది. జూనియర్‌ ఆర్టిస్టుగా మీ అనుభవాలు ఏంటి? అప్పట్లో రోజుకి రూ.250 ఇచ్చేవారు. ఆ డబ్బులు అందుకున్నప్పుడు భలే కిక్‌ ఉండేది. యాభై రూపాయలతో స్నేహితులకు పార్టీ ఇచ్చేవాడిని. ఇప్పుడు చేతిలో ఎంత డబ్బున్నా, ఆ ఆనందం దొరకడం లేదు. ఎక్కువగా హీరో వెనుక నిలబడే వేషాలు దక్కేవి. తెరపై కళ్లు మూసి తెరిచేలోగా నేను కనిపించి, మాయమైపోయేవాడిని. అయితే పరాజయాలకు, పరాభవాలకూ కుంగిపోలేదు. వాటి నుంచే నేర్చుకున్నా. రవితేజ ఎనర్జీ వేరే స్థాయిలో ఉంటుంది. దాన్ని మీరు ఎలా మ్యాచ్ చేశారు? బ్యాటరీలో ప్లస్, మైనస్ ఉంటాయి. ఇటు ప్లస్ అయితే అటు మైనస్ అవ్వాలి. అటు మైనస్ అయితే ఇటు ప్లస్ అవ్వాలి. స్క్రీన్ మీద కూడా ఆ విధమైన బ్యాలెన్స్ ఉండాలి. నేను కూడా అలానే చేశాను. ఆయన పాజిటివిటీ, స్టైల్ అన్నీ గమనించి దానికి తగ్గట్టు నేను చేశా. రవిజేతలో మీకు బాగా నచ్చింది ఏంటి? రవితేజ టైమింగ్‌ నాకు బాగా నచ్చింది. ఉదయం తొమ్మిదింటికి సెట్‌కి వస్తారు. ఆరింటికల్లా వెళ్లిపోతారు. ఆయన సమయపాలన, నిజాయతీ నాకు బాగా నచ్చుతాయి. గతంలో మీరు చేసిన పాత్రలకి, ‘డిస్కోరాజా’లో క్యారెక్టర్‌కి తేడా ఏంటి? ఉంది. ఈ పాత్ర నాకే చాలా కొత్తగా అనిపించింది. సేతు క్యారెక్టర్‌లో రెండు షేడ్స్ ఉన్నాయి. ఒక కుర్రాడు, రెండోది వయసు మళ్లిన సేతు. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయడం నాకు కొత్తగా అనిపించింది. ‘జిగర్తాండ’, ‘సామి 2’లో కూడా ఓల్డేజ్ పాత్ర చేశాను. కానీ, వాటికి ‘డిస్కోరాజా’లో సేతు పాత్రకి తేడా ఉంది. ఇది చాలా కొత్తగా ఉంటుంది. ఏ భాషలో అయినా డబ్బింగ్ కూడా నేనే చెప్పుకుంటాను. ఒకవేళ భాష రాకపోతే నేను ఆ సినిమాలో నటించను. తెలుగులో మీరు అంగీకరించని సినిమాలు ఏమైనా ఉన్నాయా? చాలా ఉన్నాయండి. కారణం కథ. మొదట్లో ఒకసారి కనిపించి ఆఖరిలో మరోసారి కనిపించి తన్నులు తిని వెళ్లిపోయే పాత్రలు నాకు నచ్చవు. పారితోషికం కూడా నాకు ప్రధానం కాదు. నేను పెద్ద సినిమాలు చేస్తాను.. చిన్న సినిమాలు చేస్తాను. ‘ఏదైనా జరగొచ్చు’ చిన్న సినిమా. కానీ, నాకు కథ నచ్చింది. రజినీకాంత్, కమల్ హాసన్ గురించి.. రజినీకాంత్‌ పక్కన నటించాలన్నది నా కోరిక. కార్తీక్ ఆయనతో సినిమా చేస్తున్నాడని తెలిసి కనీసం జూనియర్ ఆర్టిస్టుగానైనా అవకాశం ఇవ్వమని అడిగాను. కానీ, కార్తీక్ పెద్ద పాత్రే ఇచ్చాడు. రజినీ గారిని తెరపై చూడటం తప్ప ఆయన కెమెరా ముందు ఎలా నటిస్తారో ఎప్పుడూ చూడలేదు. ‘పేట’లో నటించినప్పుడు నాకో మ్యాజిక్‌లా అనిపించింది. ఆ సమయంలో రజినీ గారిని బాగా పరిశీలించాను. చాలా నేర్చుకున్నాను. అలాగే, కమల్ హాసన్ గారికి తెలియనదంటూ ఏమీ లేదు. అన్ని క్రాఫ్ట్స్ గురించి తెలుసు ఆయనకి. కమల్ గారి దగ్గర నుంచి కూడా చాలా నేర్చుకున్నాను. ఇలాంటి దిగ్గజాల పక్కన నటించే అవకాశం రావడం నా అదృష్టం. సినీ ప్రయాణం గురించి.. నాకు తొలి అవకాశం సిద్ధార్థ్ ‘లవ్ ఫెయిల్యూర్’లో వచ్చింది. అందులో ఒక చిన్న పాత్ర చేశాను. ఆ తరవాత ‘పిజ్జా’, ‘సూదు కవ్వమ్‌’, ‘నేరమ్‌’ చిత్రాల్లో నటించాను. ఆ తరవాత ‘జిగర్తాండ’తో బ్రేక్ వచ్చింది. జూనియర్‌ ఆర్టిస్టుగా అనుభవాలు.. రోజుకి రూ.250 ఇచ్చేవారు. ఓల్డ్ మంక్‌కి రూ.90 పోయేది. అవి గోల్డెన్ డేస్. ఫ్రేమ్‌లో నిలబడటమే పెద్ద విషయంలా ఉండేది. సాయంత్రం 6 గంటల తరవాత రూ.250 తీసుకున్నప్పుడు వచ్చే సంతోషంగా అలా ఇలా ఉండదు. బాటిల్‌తో వస్తు్న్నా అందరూ వచ్చేయండి ఫ్రెండ్స్‌కి ఫోన్ చేసేవాడిని. పేపర్లు పరిచి వాటిపై చిప్స్ వేసుకుని ఫ్రెండ్స్ కలిసి మందు కొడుతుంటే ఆ కిక్కేవేరు. హాఫ్ బాటిల్ ఆరుగురు తాగేవాళ్లం. అయినా దానిలోనే ఒక ఎంజాయ్‌మెంట్ ఉండేది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/36jjfe2

No comments:

Post a Comment

'Aamir And I Are Still Very Close'

'After being married for almost 18 years, and since there was never any rancour between us, we are still very close, as parents of Azad,...