మెగాస్టార్.. ఈ సౌండ్ వింటేనే అభిమానుల్లో ఏదో తెలియని ఉత్సాహం. ఆయన్ని తెరపై చూస్తే అంతుపట్టలేని ఆనందం. ఆయనో స్టెప్ వేస్తే ఈలలు, గోలలు. ఆయన గొంతు వింటే అభిమానుల్లో పూనకమే. అభిమానులకు ఆయనో బలం. నేటి తరం నటీనటులకు ఆయనో స్ఫూర్తి. కొణిదెల శివశంకర వర ప్రసాద్ దగ్గర నుంచి స్వశక్తితో, స్వయంకృషితో మెగాస్టార్ చిరంజీవిగా ఎదిగిన ఆయన కథ ఓ చరిత్ర. 41 ఏళ్ల ముందు మొదలైన ఆయన సినీ ప్రస్థానం ఇంకా కొనసాగుతూనే ఉంది.. కాదు కాదు, కొనసాగుతూనే ఉంటుంది. చిరంజీవి నటించిన తొలి సినిమా ‘పునాదిరాళ్లు’ అయినప్పటికీ విడుదలైన సినిమా మాత్రం ‘ప్రాణం ఖరీదు’. సరిగ్గా నేటికి 41 ఏళ్ల క్రితం అంటే 1978 సెప్టెంబర్ 22న ‘ప్రాణం ఖరీదు’ సినిమా విడుదలైంది. ఇప్పుడు అదే రోజున ‘సైరా నరసింహారెడ్డి’ ప్రీ రిలీజ్ వేడుక జరగనుంది. ఇది యాదృచ్ఛికమో.. లేదంటే కావాలనే ఈరోజున ‘సైరా’ వేడుక నిర్వహిస్తున్నారో తెలీదు కానీ.. సెప్టెంబర్ 22 మాత్రం మెగా అభిమానులకు జీవితాంతం గుర్తుండిపోతుంది. ‘ప్రాణం ఖరీదు’ నుంచి ‘సైరా’ వరకూ చిరంజీవి నట జీవితంలో ఎన్నో హిట్లు.. సూపర్ హిట్లు ఉన్నాయి. నిజానికి చిరంజీవి ఒక మాస్ హీరో. ఆ ఇమేజ్‌తోనే ఆయన కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. అయితే, చిరంజీవి కేవలం మాస్, కమర్షియల్ సినిమాలతే పరిమితం కాలేదు. కె.విశ్వనాథ్, జంధ్యాల, భారతీరాజా, కె.బాలచందర్ వంటి క్లాసిక్ డైరెక్టర్ల సినిమాల్లో నటించి.. నటనలోనూ తనకు సాటి ఎవరూ లేరని నిరూపించుకున్నారు. కమర్షియల్ ఇమేజ్ ఉన్నా క్లాసిక్ సినిమాలతో ప్రయోగాలు చేశారు. Also Read: ‘స్వయంకృషి’, ‘ఆపద్భాందవుడు’, ‘ఆరాధన’, ‘రుద్రవీణ’, ‘చంటబ్బాయ్’ వంటి సినిమాలు ఈ కోవకే చెందుతాయి. ఈ సినిమాల్లో మనకు ఎప్పుడూ చూసే చిరంజీవి కాకుండా మరో చిరంజీవి కనిపిస్తారు. ఈ సినిమాల్లోని చిరంజీవి నటనను చూస్తే మాస్ ఇమేజ్ ఆ నటుడిని డామినేట్ చేసిందని అనిపిస్తుంది. చిరంజీవి తొలినాళ్ళలో చేసిన ‘మనవూరి పాండవులు’, ‘పున్నమినాగు’, ‘ఊరికిచ్చినమాట’, ‘చట్టానికి కళ్లులేవు’, ‘న్యాయం కావాలి’, ‘మంచుపల్లకి’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘శుభలేఖ’, ‘అభిలాష’, ‘ఛాలెంజ్’ వంటి సినిమాలు ఆయనలోని మంచి నటుడిని మనకు చూపించాయి. కానీ, ‘ఖైదీ’ తరువాత చిరంజీవి ఇమేజ్ మారిపోయింది. అంతవరకూ లేని మాస్ ఇమేజ్‌ను ఈ సినిమా తెచ్చిపెట్టింది. దీంతో చిరు మాస్ ఇమేజ్ ఛట్రంలో ఇరుక్కుపోయారు. ఇక అక్కడి నుంచి ఆయన మాస్ ఇమేజ్ ఆకాశానికి అంటింది. ముఖ్యంగా ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన చిరంజీవి సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్‌గ్రీనే. కె.రాఘవేంద్రరావు, విజయ బాపినీడు, బి.గోపాల్ వంటి దిగ్గజ దర్శకులతోనూ చిరంజీవి సూపర్ హిట్ చిత్రాలను అందించారు. ఇక్కడ ఇంకో విచ్చిత్రమేమిటంటే.. చిరంజీవి 100వ చిత్రం ‘త్రినేత్రుడు’ సైతం సెప్టెంబర్ 22వ తేదీనే విడుదలైంది. ఆ సినిమాకు నేటితో 31 ఏళ్లు. ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నాగబాబు నిర్మించారు. 1988 సెప్టెంబర్ 22న ఈ చిత్రం విడుదలైంది. ‘త్రినేత్రుడు’ సినిమా 31 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా చాలా మంది మెగా అభిమానులు ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని షేర్ చేసుకుంటున్నారు. మొత్తం మీద చిరంజీవి 151వ చిత్రం ‘సైరా’ ప్రీ రిలీజ్ వేడుక కూడా ఈ ప్రత్యేకమైన రోజున జరుగుతుండటం మెగా అభిమానులకు విశేషమే. ఈ చిత్రం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30eFwf2
No comments:
Post a Comment