Sunday, 5 January 2020

అనిల్ రావిపూడి వారసుడొచ్చాడు.. ఒకేరోజు రెండు సంబరాలు

వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా చేశారు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదలకు సిద్ధమవుతోంది. ఈరోజు (జనవరి 5న) చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వస్తున్నారు. దీంతో చిత్ర యూనిట్‌తో పాటు మెగా, సూపర్ స్టార్ ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే, అనిల్ రావిపూడి ఇంట్లో ఒకేరోజు రెండు సంబరాలు వచ్చాయి. ఆయన మరోసారి తండ్రయ్యారు. అనిల్ సతీమణి ఆదివారం ఉదయం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. అంటే, సరిగ్గా ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ రోజునే అనిల్ ఇంటికి వారసుడొచ్చాడు. ఈ విషయాన్ని మహేష్ బాబు స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ‘‘నా దర్శకుడు అనిల్ రావిపూడికి కొడుకు పుట్టాడు. తల్లిదండ్రులకు నా అభినందనలు. నా ప్రేమ, ఆశీర్వాదాలను ఆ చిన్నారికి అందిస్తున్నాను. మెరిసిపోండి బ్రదర్’’ అని మహేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. మహేష్ ట్వీట్‌కు అనిల్ రావిపూడి స్పందించారు. తనకు అభినందనలు తెలిపిన సూపర్ స్టార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, అనిల్ రావిపూడికి ఇప్పటికే పాప ఉంది. ఇప్పుడు రెండో సంతానంగా బాబు పుట్టాడు. ఈ చిన్నారి రాకతో ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా విడుదలకు ముందే అనిల్ రావిపూడి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఇక సినిమా విడుదలైన తరవాత ఆ పండగ రెండింతలు అవుతుందేమో చూడాలి. కొడుకు పుట్టిన ఆనందంలో ఈరోజు జరిగే ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ ఏం మాట్లాడతారు అనేది కూడా ఆసక్తికరమే. ఇదిలా ఉంటే, దిల్‌ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎ.కె. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. లేడీ అమితాబ్‌గా ప్రసిద్ధికెక్కిన విజయశాంతి ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. రాజేంద్రప్రసాద్‌, ప్రకాష్‌రాజ్‌, సంగీత, బండ్ల గణేష్ ఇతర పాత్రల్లో నటించారు. దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం సమకూర్చిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రఫీ అందించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2QopJni

No comments:

Post a Comment

How RSS Plans To Win Vidarbha For BJP

'BJP and RSS may have differences over minor issues but their hearts long for one common aim -- that of A Hindu Rashtra.' from red...