హైదరాబాద్ మెట్రో రైళ్లలో అంతకంతకు పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటూనే ఉంది. ఈ క్రమంలో మెట్రో రైలు ప్రయాణం, జాగ్రత్తల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక సరికొత్త ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. ఇందు కోసం స్టార్ మా ఛానెల్, ఎల్ అండ్ టీ మెట్రో రైల్ హైదరాబాద్ లిమిటెడ్ చేతులు కలిపాయి. బుల్లితెర ద్వారా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతోన్న అతిపెద్ద రియాలిటీ షో ‘బిగ్ బాస్’ను దీనికి ఆయుధంగా ఎంచుకున్నారు. ‘బిగ్ బాస్ ఈజ్ వాటింగ్ యు’ (బిగ్ బాస్ మిమ్మల్ని చూస్తున్నాడు) అనే స్లోగన్‌తో ఈ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ ప్రచార కార్యక్రమం ద్వారా నగరంలోని 48 మెట్రో స్టేషన్లలో కాన్‌కోర్స్, ప్లాట్‌ఫాం లెవెల్, రిటైల్ స్పేస్‌ల వద్ద ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన జింగిల్స్‌తో పాటు అదే తరహా సందేశాలను సైతం అన్ని మెట్రో రైళ్లలోనూ ప్రచారం చేయనున్నారు. ఈ క్యాంపెయిన్‌ను ఈ ‘బిగ్ బాస్’ సీజన్ మొత్తం ప్రచారం చేయనున్నారు. ఈ క్యాంపెయిన్ ద్వారా మెట్రో ప్రయాణికులు రైళ్లు, స్టేషన్ ప్రాంగాణాలలో చేయాల్సిన, చేయకూడని అంశాల పట్ల అవగాహన కల్పించనున్నారు. వాస్తవానికి ఇది వాణిజ్య ఒప్పందమే అయినప్పటికీ ప్రజలకు ఎంతో చేరువైన ‘బిగ్ బాస్’ ద్వారా ప్రచారం చేయిస్తే ప్రయాణికులకు త్వరగా రీచ్ అవుతుందని హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ భావిస్తోంది. అందుకే, కింగ్ నాగార్జునను కూడా రంగంలోకి దింపింది. ‘బిగ్ బాస్’కు హోస్ట్‌గా ఉన్న నాగార్జున.. ఈ ప్రచారంలో కూడా పాలుపంచుకోనున్నారు. Also Read: ఈ ప్రచార కార్యక్రమం ప్రారంభోత్సవంలో స్టార్ మా నెట్‌వర్క్ బిజినెస్ హెడ్ అలోక్ జైన్, ఎల్‌టీఎంఆర్‌హెచ్ఎల్ ఎండీ, సీఈవో కేవీబీ రెడ్డితో పాటు నాగార్జున కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. వినోదం, మంచి సమాజం సమ్మేళనమే ఈ ప్రచారం అని అన్నారు. సమాజానికి ఎంతో అవసరమైన సందేశం అందించడం కోసం బిగ్ బాస్ ప్లాట్‌ఫాంను క్రియేటివ్‌గా ఉపయోగిస్తున్నారని నాగార్జున కొనియాడారు. ఇలాంటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడానికి హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ముందుకు రావడం సంతోషకరమని అన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30fet3h
No comments:
Post a Comment