తన జీవితంలో సెప్టెంబర్ 22 ఎంతో ప్రత్యేకమైన రోజని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. తన మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైంది ఇదే రోజని చెప్పారు. చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘సైరా నరసింహారెడ్డి’. రామ్ చరణ్ నిర్మాత. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగింది. ఈ వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. అలాగే ఎస్.ఎస్.రాజమౌళి, వి.వి.వినాయక్, కొరటాల శివ అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ తన జీవితంలో సెప్టెంబర్ 22 గొప్పతనాన్ని వివరించారు. ‘‘సెప్టెంబర్ 22 నా జీవితంలో ఒక అద్భుతమైన ల్యాండ్ మార్క్. 1978 సెప్టెంబర్ 22 నా మొట్టమొదటి సినిమా ‘ప్రాణం ఖరీదు’ విడుదలైన రోజు. నా సినిమా ప్రజల ముందుకు వెళ్తుంది, నా గురించి వాళ్లు ఏమనుకుంటారు? సినిమా ఎలా ఉంటుంది? నా భవిష్యత్తు ఎలా ఉంటుంది? అనే మీమాంసలో ఒక మిక్సిడ్ ఫీలింగ్ నాది. ఒక పక్క ఎక్సైట్‌మెంట్, మరోపక్క టెన్షన్, ఇంకోపక్క ఏదో తెలియని ఉద్విగ్నత.. ఇలా రకరకాల ఫీలింగ్స్‌తో నేను ఈ నేల మీద లేనంటే ఒట్టు. అలాంటి ఉద్విగ్నత, అలాంటి టెన్షన్, ఎక్సైట్‌మెంట్ 41 సంవత్సరాల తరవాత ఈ 2019 సెప్టెంబర్ 22న నేను ఫీలవుతున్నాను అనేది వాస్తవం’’ అని చిరంజీవి అన్నారు. తాను ఈ విధమైన ఫీలింగ్‌లో ఉండటానికి కారణం ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత కథ ‘సైరా’ అని చిరంజీవి చెప్పారు. ‘‘ఏ కథ అయినా సరే అప్పటికప్పుడు అనుకుంటాం, దాన్ని అద్భుతంగా అల్లుకుంటాం, సెట్స్‌పైకి తీసుకెళ్తాం. కానీ, ఈ సినిమా అలా కాదు. దాదాపుగా ఒకటిన్నర దశాబ్దం, ఒక పుష్కరకాలం మించి నా మదిలో మెదులుతోంది. నాకు స్వాతంత్య్ర సమరయోధుడు పాత్ర చేయాలనుందని 25 సంవత్సరాల క్రితం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. భగత్ సింగ్ పాత్ర చేయాలని ఉండేది. కానీ, ఏ దర్శకుడు, నిర్మాత నా ముందుకు తీసుకురాలేదు. ఆ కోరిక , ఆ కల అలానే ఉండిపోయింది. కానీ, ఈ సినిమాతో ఆ కోరిక తీర్చుకున్నా’’ అని చిరంజీవి చెప్పారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/30gKU0i
No comments:
Post a Comment