మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు టాలీవుడ్‌లో ఎలాంటి వాతావరణానికి తెరలేపాయో అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల సందర్భంగా అప్పటి ‘మా’ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు ఒకరిపై ఒకరు బురద జల్లుకున్నారు. ‘మా’ అధ్యక్షుడిగా నరేష్ గెలిచిన తరవాత కూడా శివాజీ రాజా ఆయనపై పలు ఆరోపణలు, విమర్శలు చేశారు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం వీరి మధ్య మనస్పర్థలు తొలగిపోయాయని అంటున్నారు హీరో డాక్టర్ రాజశేఖర్. ‘మా’ కొత్త కమిటీ ఏర్పడిన తరవాత తొలి జనరల్ బాడీ మీటింగ్‌ను ఆదివారం నిర్వహించారు. ఈ మీటింగ్‌లో కూడా పాల్గొనడం విశేషం. కేవలం ఈ మీటింగ్‌లో పాల్గొనడమే కాదు.. ఈ కార్యక్రమానికి అవసరమయ్యే ఏర్పాట్లలో కూడా శివాజీ రాజా సహాయం చేసినట్టు ప్రస్తుత ‘మా’ ఎగ్జిక్యూటివ్ ప్రెసిడెంట్ రాజశేఖర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘మొదట ‘మా’లో చిన్న చిన్న మనస్పర్థలు ఉండేవి. దీంతో ఈ మీటింగ్ ఎలా జరుగుతుందో అన్న భయం మాలో ఉంది. కానీ, బాగా జరిగింది. మీటింగ్ ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఊహించలేదు. సమావేశంలో కొంత ఆవేశానికి గురైనా, అంతిమంగా ఆరోగ్యకరంగా సాగడం ఆనందంగా ఉంది. మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్ కలిసి అన్నీ సెట్ చేశారు’ అని అన్నారు. నరేష్, శివాజీ రాజా ఇద్దరూ కలిసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అలాగే, ‘మా’ జనరల్ బాడీతో కలిసి శివాజీ రాజా ప్రతిజ్ఞ కూడా చేశారు. మొత్తానికి ఇన్నాళ్లూ కారాలు, మిర్యాలు నూరుకున్న ప్రత్యర్థులు ఒక్కటయ్యారు. ఈ విధంగా ఒకరి ఒకరు సహాయ సహకారాలు అందించుకుంటే ‘మా’ సభ్యులకు కూడా అందాల్సిన ఫలాలన్నీ సక్రమంగా అందుతాయని సినీ పరిశ్రమకు చెందిన వారు అంటున్నారు. కాగా, కృష్ణంరాజును ‘మా’ ముఖ్య సలహాదారుగా నియమించారు. ఈ సందర్భంగా ఆయన్ని మీటింగ్‌లో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పరుచూరి వెంకటేశ్వరరావు, జీవితా రాజశేఖర్, కవిత, హేమ, బెనర్జీ, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2xbor4u
No comments:
Post a Comment