Sunday 30 June 2019

ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు అన్నారు: సందీప్ కిషన్

కథానాయకుడిగా నటిస్తూ, నిర్మిస్తున్న చిత్రం ‘నిను వీడని నీడను నేనే’. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్రహ్మణ్యన్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత సమకూర్చారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. జూలై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోది. ఈ నేపథ్యంలో ప్రచారంలో భాగంగా సినిమా ట్రైలర్‌ను ఆదివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రముఖ నిర్మాత 'జెమిని' కిరణ్, అనిల్ సుంకర ట్రైలర్‌ను విడుదల చేశారు. ట్రైలర్ విడుదల కార్యక్రమంలో పాల్గొన్న హీరో సందీప్ కిషన్ సుధీర్ఘంగా మాట్లాడారు. తన ఆవేదనను, కసిని చెప్పుకున్నారు. "అందరూ నిర్మాత అంటుంటే కొత్తగా ఉంది. నన్ను నేను వెండితెరపై చూసుకుని రెండేళ్లు అవుతోంది. ఒక యాక్టర్‌‌కు అది నరకం. సినిమా తప్ప ఇంకేదీ తెలియని నాలాంటి వాడికి పెద్ద నరకం. కొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల అయినప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటారు. అది విని తట్టుకోలేమేమో అని థియేటర్‌కి వెళ్లలేదు. ఆ సమయంలో విదేశాలు వెళ్లాను. ఇక్కడి నుంచి బయటకు వెళితే కాస్త బ్రెయిన్ రిఫ్రెష్ అవుతుంది అని అనుకున్నా. తిరిగి వచ్చేసరికి బాగా లావు అయ్యాను. మళ్లీ బరువు తగ్గి సినిమాలు చేద్దాం అనుకుని మాకు బాగా కావలసిన ఇండస్ట్రీ వ్యక్తిని కలిశారు. ఆయన చాలా పెద్ద వ్యక్తి. మాటల మధ్యలో మేనేజర్లు నా గురించి చెప్పబోతే... 'ఇంకెక్కడి సందీప్! అయిపోయాడు. కొత్త హీరోలు వచ్చారు కదా. వాళ్ల గురించి చెప్పు' అన్నారట‌. ఆ మాట అన్న వ్యక్తికి థాంక్యూ ఆయనపై నాకు ఎలాంటి కోపం లేదు. ఆయన అలా అనడం వల్ల ఈ సినిమా చేశా. ఎందుకు అంటే.. నా జీవితంలో నేను ఎప్పుడు ఏది చేయాలి అనేది డిసైడ్ చేయడానికి ఎవరికీ హక్కు లేదు. నాకు మాత్రమే హక్కు ఉంది. అవకాశాలు మనకు రావు, మనమే సృష్టించుకోవాలి. ఇన్నాళ్ళు నేను నమ్మిన సినిమాలు చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కూడా నమ్మిన సినిమాలే చేస్తున్నా‌. సినిమాలు మానేసి బయటకు వెళ్లి పోయే పరిస్థితి వస్తే ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ఒక్కటైనా చేసి వెళ్లిపోవాలి తప్ప రెగ్యులర్‌గా వెళ్ళిపోయాడనే మాట ఉండకూడదు. అలా అయితే ఇన్నాళ్ళు నేను పడ్డ కష్టానికి, నేను కన్న కలలకు న్యాయం చేయలేననే ఉద్దేశంతో తీసిన చిత్రమిది. ఇండస్ట్రీలో నాకు పెద్ద దిక్కు జెమినీ కిరణ్ గారు, అనిల్ సుంకర గారు. నేను సినిమా ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నానని వాళ్లకు చెప్పగానే వద్దన్నారు. వాళ్లు నాకు కొండంత అండగా నిలబడ్డారు. అనిల్ గారు మా సినిమాకు ప్రజెంటర్. ఈ సినిమా ఆయనది కూడా. ఫస్ట్ ఫస్ట్ సినిమా చూసినది ఆయనే. ఆయన కాకుండా దయా పన్నెం నా ఫ్రెండ్, పార్ట్‌నర్.. ఎంతో అండగా నిలబడ్డాడు. నేను కథ చెప్పగానే ఒక్క ప్రశ్న కూడా అడక్కుండా సినిమా ప్రొడ్యూస్ చేయడానికి ఒప్పుకున్నాడు. నన్ను నమ్మారు. నిన్న సినిమా చూశాక దయా హగ్ చేసుకున్నాడు. మనం అనుకున్నది కరెక్ట్‌గా తీశామనే ధైర్యాన్ని ఇచ్చాడు. నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ చెప్తున్నా.. నా కెరీర్ బెస్ట్ ఫిల్మ్ తీశాం. గర్వంగా చెప్తున్నా. చాలామంది కోపంలో, భయంతో, బాధలో నిర్ణయాలు తీసుకుంటారు. సినిమాలు చేస్తారు. మేం ఈ సినిమా కసితో చేశాం. హిట్ కొట్టాలని, థియేటర్‌కి వచ్చే ప్రేక్షకులకు బెస్ట్ సినిమా ఇవ్వాలనే సింగిల్ పాయింట్ అజెండాతో తీసిన సినిమా ఇది. మేం ఎంచుకున్న వృత్తి వలన మా కుటుంబాలు ఇబ్బంది పడకూడదని, విజయాలు సాధించాలని తీసిన సినిమా ఇది. నేను ఇప్పటివరకూ మా అమ్మకు ఒక్క చీర కూడా కొనలేదు. మా పేరెంట్స్ ఏనాడూ నన్ను ఏదీ అడిగినది లేదు. వాళ్లు బయటకు వెళ్తుంటే.. 'ఏంటి? మీ కొడుకు సినిమా సరిగా ఆడటం లేదట' అనే మాట ఎవరూ అనకుండా ఉంటే చాలు. ఈ సినిమాతో పేరెంట్స్‌కి మంచి పేరు తెచ్చిపెడతా. మా దర్శకుడు కార్తీక్ రాజుగారిది 'జెర్సీ'లో నాని లాంటి స్టోరీ. ఆయనకు 46 ఏళ్లు. ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మంచి సీజీ టెక్నీషియన్. మంచి ఉద్యోగం వదులుకుని దర్శకుడు అవ్వాలని ఎనిమిదేళ్ల క్రితం డిసైడ్ అయితే.. ఇంట్లో సపోర్ట్ చేశారు. ఇవ్వాళ సినిమాను డైరెక్ట్ చేశారు. సినిమాలో నాకోసం పాట పాడిన సిద్ధార్థ్, మంచి మ్యూజిక్ ఇచ్చిన తమన్, మా బ్రదర్, ఎడిటర్ చోటా కె ప్రసాద్, మా ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివా చెర్రీ, సీతారామ్.. అందరూ ఎంతో సపోర్ట్ చేశారు. అందరికీ థాంక్స్. అలాగే, ఈ సినిమాను ఆరు నెలల క్రితం చనిపోయిన నా అభిమాని కడప శీనుకు అంకితం ఇస్తున్నా. గత రెండు మూడేళ్ళుగా ఏ సినిమా ఆడకున్నా.. నాకు ఎంతో సపోర్ట్ ఇచ్చాడు. మంచి సినిమా వచ్చేసరికి తను లేడు. అతడికి సినిమా అంకితం ఇస్తున్నా. వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ బ్యానర్ నాకు మాత్రమే పరిమితం కాదు. ఈ సినిమా బాగా ఆడితే కొత్తవాళ్లతో కూడా సినిమాలు తీస్తూ ఉంటాం" అని సందీప్ కిషన్ వెల్లడించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2RLgkoS

No comments:

Post a Comment

'Trump Will Back India On Pakistan'

'Trump will absolutely back New Delhi on its position that Pakistan must do more to crack down on terrorists that threaten India.' ...