ఒకప్పటి యాక్షన్ హీరో, డీఎండీకే పార్టీ అధ్యక్షుడు కెప్టెన్ విజయ్‌కాంత్‌ను బ్యాంక్ రుణం సమస్య ఇబ్బంది పెడుతోంది. తమ నుంచి తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించకపోవడంతో విజయ్‌కాంత్‌కు చెందిన ఆస్తులను వేలం వేసి ఆ డబ్బును రికవరీ చేసుకోవాలని బ్యాంక్ నిర్ణయించింది. తమ వద్ద నుంచి సుమారు రూ.5.5 కోట్ల రుణం తీసుకున్నారని, ఆ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు ప్రకటించింది. దీనికి సంబంధించిన ఈ-వేలం ప్రకటనను తాజాగా విడుదల చేసింది. కాంచీపురం జిల్లాలోని మమందూర్ గ్రామంలో ఉన్న శ్రీ ఆండాళ్ అళగర్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ స్థలం, భవనాలతో పాటు చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న భవనాలు, ఖాళీ స్థలాన్ని వేలం ద్వారా విక్రయించనున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఈ స్థిరాస్తుల పేరిటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి విజయకాంత్ సుమారు రూ.5.5 కోట్ల రుణం తీసుకున్నారు. వడ్డీ, ఇతర లావాదేవీలు కలుపుకుని రూ.5,52,73,825 మేర విజయకాంత్ బకాయి ఉన్నారని బ్యాంక్ చెబుతోంది. ఈ మొత్తాన్ని సకాలంలో చెల్లించకపోవడంతో ఆస్తులను వేలం వేస్తున్నట్లు స్పష్టం చేసింది. కాగా, జూలై 26 లోపు బ్యాంక్ బకాయిలను చెల్లించి తమ ఆస్తులను కాపాడుకుంటామని విజయకాంత్ భార్య ప్రేమలత చెబుతున్నారు. ‘కాలేజీ వృద్ధి కోసం మేం రుణం తీసుకున్నాం. కాలేజీ చెన్నై శివార్లలో ఉండటంతో రుణం పొందడం కోసం నగరంలోని ఆస్తిని కూడా షూరిటీగా పెట్టాం. ఈ విధమైన సమస్యలు ప్రతి కాలేజీకి వస్తాయి. ఇది చాలా చిన్న సమస్య. జూలై 26కి అడ్మిషన్లు పూర్తవుతాయి. అప్పటికి బకాయిలన్నీ కట్టేస్తాను’ అని ప్రేమలత చాలా కాన్ఫిడెంట్‌గా చెప్పారు. ఇదిలా ఉంటే, కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్.. సినిమాలు, రాజకీయాలకు దూరంగా ఉంటూ ఇంట్లోనే విశ్రాంతి తీసుకుంటున్నారు. డీఎండీకేకు కోశాధికారిగా ఉన్న ప్రేమలతే పార్టీ కార్యకలాపాలు చూసుకుంటున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/2N6zOpo
No comments:
Post a Comment