కరాటే కళ్యాణి.. ఈ పేరు వింటే మనకు బాగా గుర్తొచ్చేది ‘బా..బీ’ అనే డైలాగ్. ఆమె ఎప్పటి నుంచో తెలుగు సినీపరిశ్రమలో నటిగా కొనసాగుతున్నప్పటికీ ‘కృష్ణ’ సినిమాలో పనిమనిషి పాత్ర చాలా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అందులో బ్రహ్మానందం వంటింటి ప్రియురాలిగా ఆమె నటన, యాటిట్యూడ్ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తరవాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. ప్రస్తుతం ఆమె టీవీ సీరియళ్లతో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉంటే, కళ్యాణిని తాజాగా ఓ యూట్యూబ్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ ఇంటర్వ్యూలో కళ్యాణి తన వ్యక్తిగత, సినీ జీవితాలకు సంబంధించి ఆసక్తికర విషయాలు చెప్పారు. వీటిలో సినీ జీవితానికి సంబంధించిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ‘షూటింగ్ సెట్‌లో నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు కాస్త కోపంగా, దురుసుగా ఉంటారని.. ఎవరైనా తప్పుచేస్తే అరిచేస్తూ ఉంటారని అంటుంటారు. వారిద్దరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయి. ఈ రూమర్‌లో నిజమెంత?’ అని కళ్యాణిని యాంకర్ అడిగారు. దీనికి కళ్యాణి సమాధానం ఇస్తూ.. ‘వాస్తవానికి ఎవరికైతే వర్క్ మీద కమాండ్ ఉంటుందో, ఎవరైతే మనం చేస్తున్నది వృత్తి ధర్మం అనుకుంటారో వాళ్లకు ఆ కోపం ఉంటుంది. నాకు కూడా కోపం ఉంటుంది. ఎవరైనా నన్ను విమర్శిస్తే గట్టిగా రియాక్ట్ అవుతాను. సాధారణంగా మనం 10 లేదంటే 20 సెల్ఫీలు ఇవ్వగలం. కానీ, ఒక 100 మంది ఒకేసారి వచ్చి పడిపోతారు. అలాంటప్పుడు ఆగండి అని చిరాకుగా అంటామా లేదా? దాన్ని వీళ్లు పెద్దది చేస్తారు. అక్కడ ముందు జరిగింది ఎవ్వరూ చూపించరు. తరవాత జరిగిన దాన్ని హైలైట్ చేస్తారు’ అని కళ్యాణి వెల్లడించారు. నిజం కన్నా అబద్ధమే తొందరగా పాకుతుందని కళ్యాణి అన్నారు. బాలయ్య, మోహన్ బాబు మంచి వ్యక్తులని ఆమె కొనియాడారు. వాస్తవానికి సెట్‌లో చాలా అల్లరిగా ఉంటారని కళ్యాణి చెప్పారు. ‘ఆది’ సినిమా షూటింగ్‌లో అసిస్టెంట్‌పైకి ఎక్కి పరిగెత్తూ అంటూ గుర్రం ఆట ఆడేవాడని గుర్తుచేశారు. ‘ఎన్టీఆర్ అసిస్టెంట్ చాలా బలంగా ఉండేవాడు. అతని పైకి ఎక్కి గుర్రంలా పరిగెత్తూ అనేవాడు. అసిస్టెంట్ పరిగెత్తి సార్ ఏంటిది అని బాధపడితే అతన్ని దగ్గరికి తీసుకుని హగ్ చేసుకుని ఓదార్చేవాడు. ఇలా చేయడం ఆయనకు చాలా సరదా. సెట్‌లో చిన్నపిల్లాడి చేష్టలన్నీ చేసేవాడు. అప్పటికి ఆయన వయసు కూడా చాలా తక్కువ కదా. చేతికి బ్లడ్ ఉంటే అది అసిస్టెంట్ చొక్కాకి సరదాగా రాసేవాడు. అంత అల్లరి చేసే ఎన్టీఆర్ చేతికి నిజంగా గాయమై చేతి నుంచి రక్తం కారడం నేను కళ్లారా చూశాను’ అని ‘ఆది’ సినిమా షూటింగ్ సమయంలో విషయాలను గుర్తుచేసుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31TAzFA
No comments:
Post a Comment