Tuesday, 1 October 2019

‘సైరా’ను అడ్డుకుంటాం.. చిరంజీవి దిష్టిబొమ్మ, పోస్టర్లు దహనం!

సాధారణంగా పెద్ద పెద్ద సినిమాలు ఎప్పుడూ వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాయి. మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒక వర్గం.. ఫలానా సన్నివేశం అభ్యంతరకరంగా ఉందని మరో వర్గం.. చరిత్రను వక్రీకరిస్తున్నారని ఇంకో వర్గం.. ఇలా చాలా మంది భారీ చిత్రాల విడుదలకు ముందు హడావుడి చేస్తుంటారు. మొన్న ‘వాల్మీకి’ సినిమా విషయంలో ఇదే జరిగింది. ఆఖరికి ఈ చిత్రం టైటిల్‌ను ‘గద్దలకొండ గణేష్’గా మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, తాజాగా ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాపై వివాదం చెలరేగింది. సినిమాను విడుదల కాకుండా అడ్డుకుంటామంటూ ఒడిశాలోని కళింగసేన పార్టీ హెచ్చరించింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చారిత్రాత్మక చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’.. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అమితాబ్ బచ్చన్, నయనతార, తమన్నా, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, రవికిషన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బ్రిటిష్ దొరలకు వ్యతిరేకంగా తొలి విప్లవానికి తెరలేపింది ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అని, కానీ ఆయన చరిత్ర ఎవ్వరికీ తెలియదని చిత్ర యూనిట్ మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తోంది. 1846లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో తొలి విప్లవం జరిగిందని తెలుపుతూ సినిమాను తెరకెక్కించారు. అయితే, ఇది తప్పని కళింగసేన పార్టీ అంటోంది. వాస్తవానికి 200 ఏళ్ల కిందటే 1817లో ఒడిశాలో తొలి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని వాదిస్తోంది. Also Read: ఈ మేరకు భువనేశ్వర్‌లో ‘సైరా’ సినిమాను ప్రదర్శించనున్న శ్రీయ థియేటర్‌ వద్ద కళింగసేన పార్టీ సోమవారం నిరసన తెలిపింది. ఆందోళనకారులు అమితాబ్‌బచ్చన్‌, చిరంజీవి దిష్టిబొమ్మలు దహనం చేసి, పోస్టర్లకు నిప్పంటించారు. ఈ సందర్భంగా కళింగసేన కార్యదర్శి బిజయ్‌రాజ్‌ మాట్లాడుతూ.. ‘‘ఖుర్దా ప్రాంతం ప్రజలు పయికొ విప్లవం పేరిట తొలి పోరాటం చేశారు. దీనిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 2017లో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ కూడా పయికొ విప్లవం తొలిదిగా ప్రకటించారు. ‘సైరా’ దర్శకుడు తప్పుగా చిత్రీకరించి ఒడిశా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు. రాష్ట్రంలో ఈ సినిమాను ప్రదర్శించనీయం’’ అని హెచ్చరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2njLWXK

No comments:

Post a Comment

'Never Be Another Zakir Hussain'

'Zakir <em>bhai</em> always said, '<em>koi chala nahi jata hai</em>', he believed even after death, you ...