ప్రపంచంలోనే అతిపెద్ద ఇరిగేషన్ ప్రాజెక్ట్ ‘కాళేశ్వరం’ శుక్రవారం నాడు లాంఛనంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పట్టుదల ఉంటే దశాబ్దాలు కాదు. సంవత్సరాలోనే ఎంత పెద్ద ప్రాజెక్టు నైనా నిర్మించవచ్చని దేశానికే ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒక సంకేతాన్ని అందించడంతో దేశ వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణంపై హర్షం వ్యక్తమవుతోంది. ఇంత గొప్ప ప్రాజెక్ట్‌ను నిర్మించిన తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసల జల్లు కురుస్తోండగా.. టాలీవుడ్ సెలబ్రిటీలు సైతం కేసీఆర్ ప్రభుత్వాన్ని కొనియాడుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పటికే అక్కినేని నాగార్జున, రవితేజలు ఇదొక ఇంజినీరింగ్ అద్భుతమంటూ తెలంగాణ సీఎంను, కేటీఆర్‌ను పొగుడుతూ ట్వీట్లు చేయగా.. టాలీవుడ్ సూపర్ స్టార్ సైతం ఇదే తరహాలో కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై ట్వీట్ చేశారు. అయితే నాగార్జున, రవితేజలు కేసీఆర్, కేటీఆర్‌లను ప్రస్తావించి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంతో శ్రమించిన నాటి ఇరిగేషన్ శాఖా మంత్రి హరీష్ రావును ప్రస్తావించకపోవడం ఆయన అభిమానులకు ఆగ్రహం తెప్పించింది. తాజాగా మహేష్ బాబు సైతం హరీష్ రావు పేరును ప్రస్తావించకపోవడంతో.. ‘మేం చాలా నిరుత్సాహంగా ఉన్నాం అన్నా.. ‘హరీష్.. ఎక్కడ?’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే ‘మీరు కంగ్రాట్స్ చెప్పాల్సింది కేటీఆర్‌కి కాదు.. హరీష్ రావుకి.. ఆయన కోసం ఎంతో చేశారు. ఆయన్ని ఎందుకు ట్యాగ్ చేయలేదు’ అంటూ ప్రశ్నిస్తున్నారు. సుర్రున కాలే ఇసుకతిన్నెల్లో.. 44 డిగ్రీల ఎండ వేడిమిలో అపర భగీరథుడిగా.. పట్టు వదలని విక్రమార్కుడిలా.. శ్రామికుడిగా.. సైనికుడిగా నాటి నీటి పారుదల మంత్రి హరీశ్ రావు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని పలుసార్లు సందర్శించి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకారంతో త్వరితగతిన ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను శుక్రవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ప్రారంభించి జాతికి అంకితం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్‌మోహన్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అతిథులుగా పాల్గొన్నారు. అయితే తొలి నుండి ఈ ప్రాజెక్ట్ కోసం అహర్నిశలు శ్రమించిన హరీష్ రావు.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండి.. సిద్ధపేటకు పరిమితం అయ్యారు. అక్కడ చిన్నకోడూర్ మండలం చంద్లాపూర్ గ్రామ పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాంతంలో ప్రారంభోత్సవ సంబరాలను నిర్వహించారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu http://bit.ly/31L8ikq
No comments:
Post a Comment